ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు ప్రక్రియ ఆగిపోయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వివాదాస్పదం అయింది. దానికి కారణం ఏంటీ అంటే, అభివృద్ధి, వికేంద్రీకరణ అనేది పక్కన పెడితే, విశాఖ అనేది తూర్పు నావికాదళానికి కీలక కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. శత్రుదేశం పాకిస్తాన్ గనుక టార్గెట్ చేస్తే ముందు టార్గెట్ అయ్యేది విశాఖ.
ఉగ్రవాదులు కూడా ఆ నగరానికి రావడానికి ఆస్కారం ఉంది. దీనితోనే అసలు రాజధానిని విశాఖకు వద్దన్నారు. ఇక ప్రకృతి విపత్తులు కూడా విశాఖకు పొంచి ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు అక్కడ ఉంటే ఇబ్బంది పడటం ఖాయం. కాబట్టి రాజధాని అక్కడికి వద్దు అనేది చాలా మంది మాట. ఇదిలా ఉంటే ఇప్పుడు నావీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలక లేఖ రాసింది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.
అక్కడ అసలు ఏర్పాటు చేయవద్దని లేఖ రాసింది నావీ. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్ ఉన్నాయని, రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది. శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని.. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని పేర్కొంది.
కాబట్టి, దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని, ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందని, జనావాసాలతో కిటకిటలాడుతుందని, దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది నావీ. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొంది.