“నా రాజకీయాలపై అవాకులు చవాకులు పేలుతున్న సోషల్ మీడియాపై కేసులు వేస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను టీడీపీని, చంద్రబాబును వదిలి పెట్టేది లేదు. ఇప్పటికైనా వెబ్ సైట్ల వాళ్లు దారికి రాకపోతే.. ఎంత వరకైనా వెళ్తా“- పట్టుమని పది రోజుల కిందట టీడీపీ నేత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన రుసరుస ఇది!! ప్రజాస్వా మ్యంలో ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నట్టే.. నాయకులకుపార్టీలు మారే స్వేచ్ఛ కూడా ఉంది(దీనిని రాజ్యాంగంలో ఎక్కడా కట్టుదిట్టం చేయలేదు). కాబట్టి.. నాయకులు పార్టీలు మారడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే, దీనికి సంబంధించిన వార్తలు నేటి ముందస్తు మాధ్యమాల నేపథ్యంలో ముందుగానే హల్ చల్ చేస్తున్నాయి.
అయితే, వీటిపై మౌనం వహించడంలోనో, ఖండించడంలోనో నాయకుల విజ్ఞత కనిపిస్తుంది. కానీ, అవినాష్ అప్పుడు దూకుడుగా మీడియాపై కేసులు పెట్టారు. కానీ, తీరా ఇప్పుడు ఆయన వైసీపీలోకి చేరిపోతున్నారు. అభిమానుల ఒత్తిడి కావొచ్చు.. స్వయం నిర్ణయం కావొచ్చు.. అవినాష్ పార్టీ మార్పు జరిగిపోతోంది. సరే! ఈ విషయం అలా ఉంచితే.. నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన నిర్లక్ష్యం కారణం గా పార్టీ మారుతున్న తమ్ముళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఏకంగా పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, ఇప్పుడు అవినాష్ వంతు వచ్చింది.
అయితే, పార్టీ పరిస్థితి ఏంటి ? ఒకపక్క యువతకు పెద్దపీట వేస్తానని చెబుతున్నప్పటికీ.. చంద్రబాబు ఆలోచనా సరళిలో ఏదో మార్పు లేకపోవడం వల్లే పెద్దగా ధైర్యం పుంజుకోలేని పరిస్థితి ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది. ఇక, ఇప్పటికీ కూడా టీడీపీలో యువనాయకత్వానికి పెద్దగా గుర్తింపు లేదనేది వాస్తవం. అదేసమయంలో సామాజిక వర్గాల ప్రాతిపదికగా కూడా పార్టీలో పదవుల పంపకం పెరిగిపోవడాన్ని కొందరు సహించలేని పరిస్థితి ఉంది. అయితే, అవినాష్ విషయాన్ని తీసుకుంటే.. ఆయన ఉన్నా.. వెళ్లినా.. పార్టీకి ఇప్పుడొచ్చిన నష్టంలేదు. నిజానికి అవినాష్‌కు గుర్తింపు లేదని అనడంలోనూ వాస్తవం లేదు. 2014లో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ పార్టీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత 2016లో టీడీపీలోకి వచ్చారు. అప్పటికీ పెద్దగా యాక్టివ్‌గా లేరు. తండ్రి మరణంతో పార్టీలో 2018లో తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. నిజానికి అప్పటికే ఎంతో మంది యువత ఉన్నప్పటికీ.. సామాజిక వర్గం కోణంలో అవినాష్‌కు పెద్ద పదవే దక్కింది. ఇక, ఈ ఏడాది ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసే అద్భుత అవకాశం దక్కింది. ఓటమి అనేది సర్వసాధార ణం. మహామహులే ఈ ఎన్నికల్లో మట్టి కరిచారు. మరి ఇంతకన్నా గుర్తింపు ఎవరు మాత్రం ఇస్తారనేది టీడీపీ నేతల మాట. ఏదేమైనా.. టీడీపీలో యువ సంస్కరణలకు నాంది పలకాల్సిన సమయం వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.