అమరావతి కేంద్ర బిందువు అయిన విజయవాడ నగరంలోని కీలక నియోజకవర్గం అయిన బెజవాడ తూర్పు నియోజకవర్గ రాజకీయం మంచి రసవత్తరంగా మారుతోంది. వాస్తవానికి ఇక్కడ ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా యువనేత దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించినప్పుడు టీడీపీ వాళ్లకు పెద్దగా అంచనాలు లేవు. తమ పార్టీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముందు అవినాష్ పూర్తిగా తేలిపోతారని ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు. పైగా ఇంత బలమైన వ్యతిరేకత గాలులు వీచినా గద్దె గెలిచారని వాళ్లంతా అవినాష్‌ను లైట్ తీస్కొన్నారు. అవినాష్ ఎప్పుడు అయితే తూర్పు ఇన్‌చార్జ్‌గా వచ్చారో రెండో రోజు నుంచే నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
తూర్పు నియోజకవర్గ రాజకీయం దేవినేని ఫ్యామిలీకి అణువణువు తెలుసు. ఆ నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీ గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయం చేయడంతో పాటు ప్రజలతో తిరుగులేని అనుబంధం ఏర్పరుచుకుంది. అవినాష్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వచ్చారో లేదో అప్పటి నుంచి వైసీపీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. అవినాష్‌తో పాటు దివంగత దేవినేని నెహ్రూ అనుచరులు, మాజీ కార్పొరేటర్లు వరస పెట్టి వైసీపీలోకి క్యూ కడుతూనే ఉన్నారు. ఇక కోవిడ్ నేపథ్యంలో అవినాష్ గత మూడు నాలుగు నెలలుగా నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకు సాయం చేస్తూ వస్తున్నారు.
గద్దె అనుచరులుగా ఉన్న కీలక నేతలు కొందరు ఇప్పటికే అవినాష్ చెంత చేరగా.. డివిజన్లో మిగిలిన మరి కొందరు సైతం ఇప్పుడు పార్టీ మారేందుకు సరైన టైం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, తూర్పు నియోజకవర్గానికి చెందిన కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ తాటికొండ రంగబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఆయనతో పాటు కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు, పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు విజయవాడ ఆర్ట్ జన్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడియం రామ్, అటోనగర్ టీంకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖలీల్ కూడా వైసీపీ గూటికి చేరుకున్నారు.
ఏదేమైనా తూర్పులో కీలక నేతలు, గద్దె అనుచరులు పార్టీ వీడుతుండడంతో ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే. ఇక గద్దె వెంట రెండు దశాబ్దాలకు పైగా నడుస్తోన్న నేతలకు సైతం ఆయన ఏం చేయలేకపోవడంతో పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెట్టేయడంతో ఇప్పుడు వారంతా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. తూర్పులో అవినాష్ దూకుడు రాజకీయం.. వ్యూహాలు వైసీపీకి బాగానే కలిసొస్తున్నాయి.