కొన్ని విమానాల్లో ఇటీవల తలెత్తిన సాంకేతిక సమస్యలు మొత్తం పరిశ్రమపై పెను ప్రభావం చూపేంత తీవ్రమైనవేమీ కాదని విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ తెలిపారు. గత 16 రోజుల్లో భారత్‌కు వచ్చిన విదేశీ విమానాల్లోనూ ఈ తరహా సమస్యలు వెలుగుచూసినట్లు వెల్లడించారు అరుణ్ కుమార్. దేశ విమానయాన రంగం సురక్షితంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు అరుణ్ కుమార్. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ICAO) నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నామని తెలిపారు అరుణ్ కుమార్. చిన్న చిన్న సమస్యలు తలెత్తడం విమానాల్లో సాధారణమని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అరుణ్ కుమార్.
దేశీయ విమానాల్లో ఇటీవల వెలుగుచూసిన సమస్యల వంటివే విదేశీ విమానయాన సంస్థలు సైతం తమ విమానాల్లో గుర్తించాయని తెలిపారు అరుణ్ కుమార్. ఇటీవల స్పైస్‌జెట్, ఇండిగో సహా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పైలట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. డీజీసీఏ ఆయా సంస్థలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. రెండు నెలల ప్రత్యేక తనిఖీలను ప్రారంభించింది. అందులో భాగంగా స్పైస్‌జెట్‌కు చెందిన దాదాపు 50 శాతం సర్వీసుల్ని నిలిపివేయాలని ఆదేశించింది.