అక్కడ ఆయన ఇప్పటికే షాడో ఎంఎల్ఎ. వచ్చే సారి చట్టసభల్లో అధ్యక్షా అనాలన్నది ఆ యువనేత కోరిక..ఇంకేముంది నియోజకవర్గంలో మొత్తం యంత్రాంగాన్ని కూడ ఆయనే నడిపిస్తున్నాడు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పుడంతా షాడో ఎంఎల్ఎ హవానే కొనసాగుతుంది. నగరంలో అధికారిక ప్రోగ్రామ్ అయినా అనధికార ప్రోగ్రామ్ అయినా ఆయనకు చెప్పి చేయాల్సిందే అన్న ఆర్డర్ తో స్థానిక అధికారులు షాక్ కి గురవుతున్నారట…
మాజీ మంత్రి ప్రస్తుత ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ ఇప్పుడు కొత్తగూడెం నియోజవర్గంలో షాడో ఎమ్మెల్యేగా మారాడు. వనమా వెంకటేశ్వరరావు తెలంగాణ శాసనసభలో అతి పెద్ద వయస్కుడు కూడ. వయో బారం మీదపడటంతో ఇప్పుడు అంతా ఆయన తనయుడు రాఘవ కనుసన్నల్లోనే కొత్తగూడెం రాజకీయం నడుస్తుందట… వనమా వెంట మొదటి నుంచి ఉన్న నేతలు అందరు ఇప్పుడు రాఘవ చుట్టూ తిరుగుతున్నారు.
ఇటీవల జరిగిన ఆయన జన్మ దిన వేడుకలు నియోజకవర్గంలోనే కాక జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారాయట. కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలిటీలలో 190గ్రామాల్లో వనమా రాఘవ పుట్టిన రోజు వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు ఆయన అనుచరులు. నియోజకవర్గంలో ఏ వాడ చూసిన ఆయన పుట్టిన రోజు వేడుకలతో పండుగ వాతావరణం నెలకొంది. వనమా రాఘవ నే ఎంఎల్ఎ అన్నచందంగా వేడుకలు సాగాయంటే అక్కడ వనమా తనయుడి హవా అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేరుకే వనమా ఎమ్మెల్యేగా ఉన్నా అంతా ఆయన తనయుడి చెప్పు చేతల్లో సాగుతుంది కొత్తగూడెం రాజకీయం.
ఇక కొందరు అనుచరులైతే రాఘవనే ఎమ్మెల్యే గా సంభోదిస్తూ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారట.. దీనిపై అనుచరులను ప్రశ్నిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది రాఘవనే ఇక ఆ రేంజ్ లో కార్యక్రమాలు చేయడంలో తప్పేముందంటూ సమర్ధించుకుంటున్నారట. జనం మెచ్చిన రాఘవ అంటూ పాటలు కూడ ఆయన మీద కట్టేశారట. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సైతం ఇదే హవా కనిపిస్తుండటంతో అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యే హడావిడి ఎక్కువైందంటూ అధికారులు గొనుక్కుంటున్నారట…
వనమావెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీ కండువా మార్చేశారు. అయితే ఇక్కడ వనమా చేతిలో ఓడిన మరో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ పరిణామాల పై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి బరిలో దిగేది జలగం మాత్రమే అని ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారం మొదలెట్టేశారు. భవిష్యత్ లో కొత్తగూడెం రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
రాజకీయాలలో కీలక భూమిక పోషించాలన్న ఉత్సాహం ఉండడంలో తప్పులేదు కానీ.. ప్రొటోకాల్‌ను దాటి అధికారిక కార్యక్రమాలలో అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో
వ్యక్తం అవుతోంది.