ఈ ఐటమ్స్‌ ఎక్స్‌పైరీ డేట్‌ కంటే ముందే పాడవుతాయి తెలుసా..?

-

మార్కెట్‌లో ఏది తీసుకున్నా వాటికి ఎక్స్‌పైరీ డేట్‌ చూసే కొంటాం. ఎక్స్‌పైరీ డేట్‌ లేకుండా దాదాపు ఏ వస్తువు ఉండదు. ఆఖరికి వాటర్‌ బాటిల్‌కు, కాటన్‌కు కూడా గడువు తేదీ ఉంటుంది. ఎక్స్‌పైరీ డేట్‌ వరకూ మనం ఏ వస్తువులైనా వాడొచ్చు అని అనుకుంటాం. కానీ కొన్ని ఎక్స్‌పైరీ డేట్‌ కంటే ముందే పాడేపోతాయి. మీరు ఇంకా వీటికి టైమ్‌ ఉంది కదా వాడుతుంటారు. దానివల్ల అనవసరంగా హెల్త్‌ ఇష్యూస్‌ వస్తాయి. ఇంతకీ అవి ఏంటో చూద్దామా..!

ఓట్స్

అందరి ఇళ్లలో ఓట్స్‌ ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారి కిచెన్‌లో అయితే పక్కా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివే.. మనదేశంలో పండనప్పటికీ ఇక్కడ మనం విరివిగా ఉపయోగిస్తున్నాం. రోజూ ఓట్స్‌ను తినేవాళ్లున్నారు. ఓట్స్ ప్యాకెట్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ కన్నా ముందే అవి పాడవ్వడం ప్రారంభమవుతాయి. వీటిని కొన్నాక కేవలం 4 నుంచి ఆరునెలల్లోనే ఉపయోగించేయాలి. అందుకే ఓట్స్‌ను అధిక మొత్తంలో ఒకేసారి కొనకుండా చిన్న ప్యాకెట్లుగా కొనుక్కుని వాడుకోవడం ఉత్తమం.

పిండి

ఏ రకమైన పిండైనా కొన్న తరువాత త్వరగా వాడేయాలి. పిండి ప్యాకెట్‌పై ఎక్క్‌పైరీ డేట్‌ ఎప్పుడో ఉంది కదా మనం అప్పటివరకూ వాడదాం అనుకోవడం తప్పే..ఏ పిండైనా మూత పెట్టి గాలి చొరబడకుండా ఉంటే తొమ్మిది నెలల వరకు ఫర్వాలేదు. అందుకే అలాంటి పిండిలను ఏడాదిలోపే వాడేయాలి. ఆ తరువాత అవి చాలా మార్పులకు గురవుతాయి. పురుగు పట్టే అవకాశం ఉంది. జల్లించి వాడుతుంటారు. అసలు పిండిలో పురుగులు పడ్డాయంటే..అందులో పోషకాలలు పోయినట్లే.. మీరు వాటిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా..మళ్లీ ఆరోగ్యానికే ప్రమాదం.

కూరగాయలు

బ్రోకలీ, పుట్టగొడుగులు, బెల్ పెప్పెర్స్, సెలెరీ, లెట్యూస్ వంటివి మనం దిగుమతి చేసుకుంటాం.. వాటిని కొన్న తరువాత వారం రోజుల్లోపే వండుకుని తినేయాలి. ఎందుకంటే అప్పటికే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండి మీ దగ్గరకు చేరి ఉంటాయి. కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేయడం మంచిది కాదు.

క్యాన్డ్ ఫుడ్

సూపర్ మార్కెట్లలో ఎన్నో రకాల క్యాన్డ్ ఫుడ్ అందబాటులో ఉంటుంది. టిన్‌లు, క్యాన్లలో భద్రపరిచిన ఆహారాలను ప్రజలు వాడడం కూడా అధికమే. వీటిల్లో అధికంగా ప్రిజర్వేటివ్స్ ఉపయోగిస్తారు. క్యాన్డ్ పుడ్స్‌పై ఎక్స్‌పైరీ తేదీని నమ్మకపోవడమే మంచిది. ఇలాంటి వాటిని ఏడాదిలోపే వాడాలి. ఏ ఆహారమైన అధికంగా నిల్వ ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

నూనెలు

కొంతమంది నూనెలు ఎన్నాళ్లైనా పాడవవు అని అనుకుంటారు, మూత తీయకుండా ఉంటే ఎన్నాళ్లైనా వాటిని నిల్వ చేయచ్చు అనుకోవడం పొరపాటే. మూత తెరవని నూనె డబ్బాలను రెండేళ్ల లోపే వాడుకోవాలి. మూత తీశాక మాత్రం త్వరగానే పూర్తి చేయాలి.. నూనె నిల్వ ఉంటున్న కొద్దీ దాని వాసన, రుచి మారిపోతుంది.

సో.. ఇలాంటివి ఎక్స్‌పైరీ డేట్‌ వరకూ ఆగకుండా.. తెచ్చుకున్న తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వాడుకోవడం ఉత్తమం. వీటిని బల్క్‌లో కూడా తీసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news