ఒకపక్క ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా సవాలక్ష ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీకి… అంతర్గత వ్యవహారాలూ చికాకు తెప్పిస్తున్నాయి. ప్రధానంగా ఆధిపత్య పోరు పార్టీలో కనపడకుండా నడుస్తుందనే వ్యాఖ్యలు ఎక్కువగా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలోను ఈ ఇబ్బందులు పార్టీని వెంటాడాయి. ప్రధానంగా లోకేష్ కారణంగా యువనేతలు కొందరు ఇబ్బందులు పడుతున్నారు అనే వ్యాఖ్యలు మనం కొన్ని రోజుల నుంచి వింటూనే ఉన్నాం… ఇప్పుడు కూడా ఆయన కారణంగా ఇబ్బందులు పడుతున్నారట.
లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు… రాజధాని ప్రాంతంలో ఆయన ఓటమిని పార్టీ తట్టుకోలేకపోయింది. అయినా సరే లోకేష్ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన గల్లా జయదేవ్ ని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది… గల్లా రాష్ట్ర స్థాయిలో… ఎంపీగా పాపులర్ అయ్యారు. దీనితో నియోజకవర్గంలో కూడా గల్లాకు భారీగా అభిమానులు ఉన్నారు. దీనిని లోకేష్ తట్టుకోలేకపోతున్నారు.
దీనితో గల్లా అభిమానుల మీద, వైసీపీ కార్యకర్తల రూపంలో కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో లోకేష్ చేయిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. గల్లా ఫెయిల్ అయ్యారనే ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. ఈ విషయం గల్లా దృష్టికి వెళ్ళింది. తన వర్గాన్ని నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టాలని లోకేష్ భావించడంపై అధినేత చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుందని, ఇలాంటి చర్యల వలనే పార్టీని మునిగిందని, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చూడండి అంటూ కోరారట.