ఆంధ్రావనిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నిన్నటి వేళ ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 26 జిల్లాలతో కూడిన ప్రకటన కూడా వచ్చేసింది. పరిపాలన సౌలభ్యం పేరిట ఎప్పటి నుంచో కొత్త జిల్లాల ప్రతిపాదన అయితే ఉంది. కానీ జనగణన పూర్తి కాకుండానే కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది సాధ్యం కాదని ఎప్పటి నుంచో కేంద్రం నెత్తీ నోరూ కొట్టుకుంటోంది. కానీ జగన్ ఇవేవీ వినిపించుకోకుండానే కొత్త జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి మరో వివాదం నెత్తినపెట్టుకున్నారు.
ప్రతి పార్లమెంట్ సెగ్మంట్ ను ఓ జిల్లాగా ప్రకటించి వాటికి పేర్లు సూచించారు. ఆ విధంగా తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా, మచిలీపట్నం కేంద్రంగా మచిలీపట్నం, అమలాపురం కేంద్రంగా కోనసీమ, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామ రాజు, రాజమహేంద్ర వరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లాలను ఏర్పాటు చేశారు.
అరకు లోక్ సభ స్థానాన్ని రెండుగా విడగొట్టారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే అల్లూరి సీతారామ రాజు జిల్లా ప్రతిపాదన అన్నది ఎప్పటి నుంచో ఉంది కానీ సంబంధిత ప్రతిపాదన మాత్రం ఒకప్పుడు మరోలా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సీతంపేట, అదేవిధంగా పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, పోలవరం ఐటీడీఏలను అన్నింటిని కలిపి ఓ జిల్లాగా మన్యం జిల్లాగా ప్రకటించాలని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సీతంపేట ఐటీడీఏ అన్నది మన్యం జిల్లాలో కలిసిపోయింది.
అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని మన్యం జిల్లాగానూ, అల్లూరి సీతారామ రాజు జిల్లాగానూ ఎనౌన్స్ చేశారు. మన్యంజిల్లా పరిధిలో జిల్లా కేంద్రంగా పార్వతీపురం ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం.. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు రెవెన్యూ డివిజన్లతో కూడిన కొత్త జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 16 మండలాలతో 3935 చదరపు కిలోమీటర్లు, 9.32లక్షల జనాభా తో ఏర్పాటైంది. అదేవిధంగా అల్లూరి సీతారామ జిల్లాగా అరకు లోక్ సభ పరిధిలో ఏర్పాటు కానుంది.
జిల్లా కేంద్రం : పాడేరు గా ఉండనుంది. పాడేరు,అరకు,రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లాకు పరిధి నిర్ణయించారు.22 మండలాలు ఉండనున్నాయి.
విస్తీర్ణం : 12251 చదరపు కిలోమీటర్లు, జనాభా : 9.54 లక్షలు.