అన్ని ఒకేసారి స్విచ్‌ ఆఫ్‌ చేయకండి : డిస్కమ్‌లు

-

ఈరోజు(ఏప్రిల్‌ 5) రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు విద్యుత్‌ లైట్లు ఆపి.. దీపాలు, కొవొత్తులు వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జనతా కర్ఫ్యూ రోజున ప్రధాని పిలుపు మేరకు వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి దేశ ప్రజలు చప్పట్లతో పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. అయితే మరోసారి మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడాని ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ పంపినీ సంస్థలు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నాయి.

ప్రధాని పిలుపును పాటించేవారు కేవలం లైట్లను మాత్రమే ఆఫ్‌ చేయాలని, మిగతా ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఆన్‌ చేసి ఉంచాలని కోరుతున్నాయి. లైట్లు ఆఫ్‌ చేసినప్పటికీ.. ఫ్యాన్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌ ఆన్‌ చేసి ఉంచాలని సూచించాయి. విద్యుత్‌ వినియోగంలో భారీ హెచ్చు తగ్గులు చోటుచేసుకోవడం వల్ల పవర్‌ గ్రిడ్‌ బ్యాలెన్సింగ్‌ కోల్పోయే అవకాశం ఉంటుందని పలు డిస్కమ్‌లు తెలిపాయి. ఒకవేళ విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలితే.. దానిని సరిచేయడానికి కొన్ని గంటల సమయం పడుతుందని చెప్పాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల పలు పరిశ్రమలు మూతపడటంతో మెట్రో నగరాల్లో విద్యుత్‌ వినియోగం భారీగా తగ్గిందని డిస్కమ్‌లు గుర్తుచేస్తున్నాయి.

కాగా, ప్రజలు లైట్లు ఆపే 9 నిమిషాలు, ఆ తర్వాత ఎలాంటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డిస్కమ్‌లకు సూచించింది. మరోవైపు విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ భయాలను కొట్టివేసింది. విద్యుత్‌ వినియోగంలో వ్యత్యాసాలను అదుపు చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news