తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన రాజకీయ వేదికల్లో రాజమండ్రి ఒకటి. జిల్లా రాజకీయాలపై ఇక్కడ జరిగే చర్చ అంతా ఇం తా కాదు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీకి సంబంధించిన ఓ ఇష్యూపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలను గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ హవా జోరుగా సాగినప్పటికీ.. జగన్ సునామీ వెల్లువలా వచ్చినప్పటికీ.. టీడీపీ కి చెందిన నాయకులు బుట్టలో వేసుకున్నారు. వీరిలో రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నాయకుడు, కురువృద్ధుడు బుచ్చ య్య చౌదరి, సిటీ నుంచి కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీలు విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఒకరికొకరు సహకరించుకున్నారు. ఒకటి రెండు రోజులు బుచ్చయ్య వచ్చి భవానీ కోసం ప్రచారం చేశారు.
ఇక, భవానీ కూడా రాజమండ్రి రూరల్‌కు అవసరమైన ప్రచార సామగ్రిని సమకూర్చారని అప్పట్లో చర్చలు జరిగాయి. ఎలాగైతే నేం మొత్తానికి రాజమండ్రిలో ఇద్దరూ కూడా విజయం సాధించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య సీట్ల పంపకంలో విభేదాలు వచ్చాయని అంటున్నారు. తన వారికి సిటీ పరిధిలోకి వచ్చే కార్పొరేషన్ వార్డు మెంబర్ స్థానాలు కేటాయించాలని బుచ్చయ్య చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. దీంతో బాబు బుచ్చయ్యను సంతృప్తి పరిచేందుకు వారికి స్థానాలు కేటాయించారు.
అయితే,వారు సిటీ ఎమ్మెల్యే సూచించిన వారితో సమన్వయం చేసుకో కుండా సొంతంగా ప్రచారం చేసుకోవడం, అభివృద్ధి పనులపై హామీ ఇవ్వడం వంటివి భవానీ వర్గాన్ని ఉడికించాయి. దీంతో ఆమె నేరుగా బుచ్చయ్యకు ఫోన్ చేసి మీవాళ్లు ఇలా చేస్తున్నారు చూడండి! అని ఫిర్యాదు చేయడంతో అంతా నేను చూసుకుంటానని బుచ్చయ్య హామీ ఇచ్చారు. కానీ, వారి తీరులో మాత్రం మార్పు కనిపించలేదు. కాగా, ఇంతలోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే, ఈ విషయంలో అటు బుచ్చయ్యకు ఇటు భవానీకి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, గతంలో ఏదైనా సలహా కోసం ఆమె బుచ్చయ్యను సంప్రదించేవారని, కానీ, ఇప్పుడు నేరుగా తన బాబాయి అచ్చన్నకే ఫోన్ చేస్తున్నారని అంటున్నారు.
బుచ్చయ్య కూడా సిటీలో సమస్యలు ఎక్కువుగా ఉన్నాయని పట్టించుకునే వారు ఎవరూ లేరని తన వర్గం వారితో చెప్పడం, పరోక్షంగా ఈ విషయం తనను విమర్శించినట్టేనని భవానీ భావించడంతో ఇరువురి మధ్య కూడా పోరు పెరుగుతోందనడానికి తార్కాణమని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ సీనియర్,జూనియర్‌ల మధ్య వివాదం ఇంకా పెరుగుతుందా? ఇకపై ఆగుతుందా? చూడాలి.