మహిళల శాపనార్థాలు సీఎం రేవంత్ రెడ్డికి వినపడటం లేదా..? అని మహిళల అంశంలో కేసీఆర్ ప్రభుత్వానికి మీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సీఎం కు కౌంటర్ ఇచ్చారు. నాడు మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చిన కేసీఆర్ ప్రభుత్వంతో నేడు ప్రభుత్వ కార్యాలయాల ముందు మళ్లీ మొదలైన మహిళల ఖాలీ బిందెల ప్రదర్శనతో మీరు పోటీ పడుతున్నారా..? అని ప్రశ్నించారు.
అదేవిధంగా తులం బంగారం హామీని తుంగలో తొక్కిన మీరు.. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ లాంటి వినూత్న పథకాల సృష్టికర్తతో మీ పోటీనా అని ఎద్దేవా చేశారు. వివాహాలు ఆపి అమ్మాయిల ఉన్నత విద్యకు బాటలు వేసి దాదాపు అన్ని యూనివర్సిటీల్లో బాలికలే అధికంగా ఉండటం నిజం కాదా అని నిలదీశారు.