అవాంఛిత రోమాలను తొలగించటం ఈరోజుల్లో అందరికీ అలవాటైపోయింది. ఎవరూ కూడా వాటిని అలానే ఉంచుకోవాలని అనుకోవడం లేదు. వీటికోసం షేవింగ్, ట్రిమింగ్, వాక్స్, లేజర్ ఇలా ఎవరి బడ్జెట్‌లో ఉండేవి వాళ్లు ఫాలో అవుతున్నారు. అవాంఛిత రోమాలంటే.. ఆఖిరికి ముక్కులో ఉండేవి కూడా పీకేస్తున్నారు. ముక్కులో ఉండే వెంట్రుకలను కూడా చాలామంది తీసేస్తున్నారు. మీకు తెలుసా.. ముక్కులో ఉండే హెయిర్ తీస్తే అది మెదడు ప్రమాదమని.
ముక్కులో వెంటుకలు అందాన్ని తగ్గిస్తాయని, ఎదుటివాళ్లు తమని చికాకుగా చూస్తారని చాలామంది భవిస్తారు. అందుకే, వాటిని లోతుగా కట్ చేయడం, లేదా పూర్తిగా పీకేయడం చేస్తుంటారు. ఇటీవల ముక్కులోని వెంటుకలను పూర్తిగా తొలగించే ట్రిమ్మర్లు, నోస్ వాక్సింగ్ అప్లికెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
నోస్ వాక్సింగ్‌లో భాగంగా ఒక మైనపు అప్లికేటర్‌ను నాసికా రంధ్రంలోకి పంపిస్తారు. గట్టిపడిన తర్వాత దాన్ని గట్టిగా లాగుతారు. దానివల్ల ముక్కులోని వెంటుకలు మొదళ్ల నుంచి ఊడి వచ్చేస్తాయి. ముక్కును శుభ్రంగా, క్లీన్‌గా ఉంచుకోవడం మంచిదే… కానీ, పూర్తిగా వాటిని పీకడానికి బదులు కొద్దిగా కత్తిరించుకోవడమే ఉత్తమం అని వైద్య నిపుణులు అంటున్నారు.
ముక్కులోని వెంటుకలు చూసేందుకు చిరాగ్గా కనిపించినా.. అవి మనకు మేలే చేస్తాయి. దుమ్మూ, దూళి, సూక్ష్మ జీవులు నేరుగా ఊపిరితీత్తుల్లోకి చేరకుండా అడ్డుకుంటాయి. స్నానం చేసినప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడం ద్వారా వాటికి అంటుకున్న మలినాలను తొలగించవచ్చు. మహిళలతో పోల్చితే పురుషుల ముక్కులోనే ఎక్కువగా వెంటుకలు ఉంటాయట.
మొత్తం తొలగిస్తే మొదటికే మోసం..
స్త్రీ-పురుషుల్లో ఎవరైనా సరే ఆ వెంటుకలను మొదళ్లతో సహా పెకిలించడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అలా చేయడం వల్ల మెదడుకు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందట.
మైక్రోస్కోపిక్ సిలియా అనే వెంటుకలు శ్లేష్మాన్ని ఫిల్టర్ చేసి.. గొంతు వెనుకకు పంపుతాయి. అవి అక్కడి నుంచి కడుపులోకి వెళ్తాయి. వైబ్రిస్సే అనే వెంటుకలు.. బయటకు చొచ్చుకొచ్చే ఈ వెంటుకలనే మీరు పీకేయాలని అనుకుంటారు. కానీ, అవి పెద్ద కణాలను ముక్కు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. వాటిని లాగేస్తే సూక్ష్మక్రిములు ఇన్ఫెక్షన్ కలిగిస్తాయట.
ముక్కు భాగంగాలోని నోటికి సమీపం నుంచి ముక్కు చివర వరకు ఉండే భాగాన్ని Danger Triangle అంటారు. ఈ భాగం మెదడుకు కనెక్టై ఉంటుంది. ఈ ప్రాంతంలో చిన్న ఇన్ఫెక్షన్ ఏర్పడినా.. మెదడుకు చేరుతుంది. ఈ ప్రాంతంలో ముక్కు నుంచి రక్తాన్ని బయటకు తీసుకెళ్లే సిరలు.. మెదడు నుంచి రక్తాన్ని తీసుకెళ్లే సిరలతో కలుస్తాయి. దీంతో ముక్కులో ఉండే సూక్ష్మజీవులు మెదడులోకి చేరినట్లయితే మెదడు వాపు వ్యాధి ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల మెదడులో గడ్డలు ఏర్పడతాయి.
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే వ్యక్తులకే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముక్కులోని వెంటుకలను పూర్తిగా పీకేయకుండా.. వాటిని కత్తిరించుకోవడమే మంచిది.