నటుడు కమలహాసన్ ఆరోగ్య పరిస్థితి పై వైద్యుల స్పష్టత

ప్రముఖ నటుడు కమలహాసన్ ఆరోగ్య పరిస్థితి పై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే…నటుడు కమలహాసన్ నిన్న హైదరాబాదులో కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిసిన విషయం తెలిసిందే.. ఆ తరువాత ఆయన, అనారోగ్యంతో సాయంత్రానికి ఆసుపత్రి పాలవడం అభిమానుల్లో కలకలం రేగింది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కమల్ నిన్న సాయంత్రం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు.

Kamal Haasan Health News: Kamal Haasan admitted to hospital with fever, to  be discharged soon

ఈ నేపథ్యంలో, శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యులు కమల్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం కమలహాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు. కమల్ ఆరోగ్య పరిస్థితి మరింత కుదుటపడ్డాక, మరో రెండ్రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. కమల్ ఆసుపత్రిపాలైన నేపథ్యంలో, తమిళ బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్లు అనిశ్చితిలో పడ్డాయి. తమిళ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా కమల్ వ్యవహరిస్తున్నారు. కమల్ రేపు డిశ్చార్జి అయితే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లలో బిగ్ బాస్ స్టేజ్ పై అలరించాల్సి ఉంది.