ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. ఇంకొకడు వచ్చి చుట్టకు నిప్పు అడిగాడట.. అలా ఉంది ప్రస్తుతం పలువురి తీరు.. ఒక వైపు ప్రజలు కరోనా వైరస్‌తో భయపడుతుంటే.. మరోవైపు కొందరు ప్రబుద్దులు వారి బలహీనతను ఆసరాగా చేసుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ.. డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే.. హోమియోపతి మందులను వాడాలని కొందరు నెట్‌లో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో అది నిజమేనని నమ్మి కొందరు మోసపోతున్నారు.
నిజానికి హోమియోపతి మందుల వల్ల కరోనా తగ్గుతుందని ఎక్కడా ప్రూవ్ అవలేదు. దానికి శాస్త్రీయ నిర్దారణ జరగలేదు. కానీ కొందరు మాత్రం ఆ మందుల వల్ల కరోనా నశిస్తుందని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. దాంతో పలు హోమియోపతి మందులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వారు అలా ప్రచారం చేయడానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ గతంలో ప్రచురించిన ఒక ప్రకటన కూడా కారణం. అందులో ఏముందంటే…
కరోనా వైరస్ లక్షణాలకు చికిత్స అందించేందుకు హోమియోపతి మందులను వేసుకోవచ్చని చెబుతూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ జనవరి 29వ తేదీన ప్రకటన ఇచ్చింది. అయితే దాన్ని తమకు అన్వయించుకుని కొందరు విక్రయదారులు తప్పుడు ప్రచారం చేస్తూ హోమియోపతి మందుల వల్ల కరోనా అంతమవుతుందని చెబుతూ ఆ మందులను విక్రయిస్తున్నారు. అయితే దీన్ని ఉద్దేశించి ఆయుష్ శాఖ మరొక ప్రకటన చేసింది. తాము కరోనా చికిత్సకు హోమియో మందులను వాడాలని చెప్పలేదని, కాకపోతే దాని లక్షణాలను తగ్గించేందుకు మాత్రమే హోమియో వాడవచ్చని చెప్పామని, కానీ హోమియో మందులు కరోనాను నాశనం చేస్తాయని చెప్పడం తమ ఉద్దేశం కాదని తెలిపారు. హోమియోపతి మందులు కరోనాను నిర్మూలిస్తాయని ఎక్కడా రుజువు కాలేదని, కనుక ఆ మందులను వాడేవారు జాగ్రత్తగా ఉండాలని.. ఆ శాఖ మరొక ప్రకటన ఇచ్చింది. దీంతో జనాలు అయోమయానికి లోనవుతున్నారు. ఏది ఏమైనా… కరోనాను తగ్గిస్తామంటూ ఎవరైనా ఆ మందులను అమ్మదలిస్తే జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అయోమయానికి లోను కాకండి..!