జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధ వర్ణణాతీతం. కళ్ళముందు నోరూరించే ఆహారం ఉన్నా కూడా ఎక్కడ జీర్ణం కాదో అన్న ఆలోచనతో తినడమే మానుకుంటారు. అందుకే ఎక్కువ శాతం తమకు నచ్చింది తినకుండా ఉండిపోతారు. ఏదో ఒకసారి చూద్దాంలే అని ప్రయత్నించారా.. ఇక అంతే సంగతులు.. కడుపులో ఏదో అవుతున్నట్టు, ఎందుకు తిన్నానా అని బాధపడుతూ నానా తంటాలు పడుతుంటారు. అందుకే జీర్ణసమస్యల విషయంలో జాగ్రత్త అవసరం.
జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన జీవనశైలిని పాటించడంతో పాటు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచే ఆహారాలు జీర్ణ సమస్యలను దూరం పెడతాయి. అలాంటి ఆహారాల్లో ఫైనాఫిల్ ఒకటి.
ఫైనాఫిల్ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి శరీరానికి పోషణ అందించడంతో పాటు అనేక సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఫైనాఫిల్ లోని బ్రోమిలిన్ అనే ఎంజైమ్, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ప్రోటీన్ కణాలని చిన్న చిన్న అమైనో ఆమ్లాలుగా మార్చడంలో ఈ ఎంజైమ్ సాయపడుతుంది. అంతేకాదు పెప్టైడ్ కణాలుగా కూడా మారుస్తుంది. దానివల్ల ప్రేగుల్లో నుండి ఆహారం సులభంగా ప్రయాణిస్తుంది.
జీర్ణ సమస్యలను పరిష్కరించడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఫైనాఫిల్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా శరీరానికి మంచి పోషణ అందుతుంది. ఇంకా విటమిన్-ఏ, విటమిన్-కె, ఫాస్పరస్, కాల్షియం, జింక్ మొదలగునవి ఉన్నాయి.
ఫైనాఫిల్ పొట్టులో ఉండే మాంగనీస్ కారణంగా ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. అందుకే ఫైనాఫిల్ తినడాన్ని ఎప్పుడూ మిస్ కావద్దు.