పోర్న్‌స్టార్‌కు నగదు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది గంటల్లో కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టులో ట్రంప్‌ను రహస్యంగా విచారించనున్నట్లు న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జుయాన్ మెర్చన్ వెల్లడించారు. మీడియాను లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఓ శృంగార తార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పిన కేసులో ట్రంప్ పై క్రిమినల్ అభియోగం మోపాలని గత గురువారం మన్‌హాటన్ గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఈ ఆరోపణపై ట్రంప్ తన సమాధానాన్ని ఇవాళ మన్ హాటన్ కోర్టులో వినిపించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ట్రంప్ న్యూయార్క్ చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన న్యూయార్క్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చన్ ఎదుట హాజరై క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ విచారణను ప్రసారం చేసేందుకు అనుమతినివ్వాలంటూ పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది.