శివరాత్రి మర్నాడు శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే… ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతికరం. అందుకే ఆ రోజున మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకొంటారు. మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. అలా కాకపోతే, ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.
ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మర్నాడు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానన్ని పార్వతికి ఆదిదేవుడు బోధించిన విశేషాలు ఇవి. ఇవన్నీ వీలుకావు అనుకున్నవారు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిరంతరం శివనామాన్ని మనసులో ధ్యానం చేస్తూ, రాత్రిపూటైనా దేవాలయంకు వెళ్లడం, శివకళ్యాణం చూడటం చేయండి.