మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటారు. కానీ పరిమిత మోతాదులో దాన్ని తీసుకుంటే గుండెకు మేలు చేస్తుందని, ఒత్తిడితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుందని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ తన 70వ వార్షిక సైంటిఫిక్ సెషన్లో ఓ అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించింది.
మొత్తం 53,064 మంది సర్వేలో పాల్గొనగా అందులో 59.9 శాతం మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారి సగటు వయస్సు 57.2 సంవత్సరాలు. అయితే వారంలో వారు ఎంత మోతాదులో మద్యం సేవిస్తారు, వారికి ఉన్న వ్యాధులు, గుండె సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సమస్యలు తగ్గాయా ? అన్న వివరాలను సేకరించారు. ఈ క్రమంలో సమాచారాన్ని విశ్లేషించి సైంటిస్టులు వివరాలను వెల్లడించారు.
మొత్తం మందిలో 17 శాతం మంది తక్కువ మోతాదులో ఆల్కహాల్‌ను తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో పరిమిత మోతాదులో ఆల్కహాల్‌ను తీసుకునే వారిలో మెదడు, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 20 శాతం మేర తగ్గాయని తేల్చారు. అలాగే స్వల్ప మోతాదులో ఆల్కహాల్‌ను సేవించే వారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గినట్లు కూడా గుర్తించారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని మద్యాన్ని విపరీతంగా సేవించరాదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప మోతాదులో తాగితేనే ప్రయోజనం ఉంటుందంటున్నారు.