దుబ్బాక ట్రయాంగిల్‌ ఫైట్‌ మరో టర్న్‌ తీసుకుందా…?

-

పోలీంగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం రంగు మారుతోందా? ట్రయాంగిల్‌ ఫైట్‌ అవుతుందన్న అంచనా కొత్త టర్న్‌ తీసుకుంది.దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకముందే ఆ నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ ఓ రేంజ్‌కి వెళ్లింది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించడంతో అప్పటికప్పుడు కాంగ్రెస్‌లో చేరి బరిలో దిగారు చెరుకు శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు కావడంతో మంచి పోటీ ఇస్తారని భావించారు కాంగ్రెస్‌ నాయకులు.

దీనికితగ్గట్టుగానే AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా కొత్తగా వచ్చిన మాణిక్యం ఠాగూర్‌ స్వయంగా ఎన్నికల వ్యూహ రచన చేసి.. సీనియర్లందరికీ గ్రామాలు, మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్తేజం తీసుకురావాలంటే ఇక్కడ సత్తా చాటాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం.

కాంగ్రెస్‌ లక్ష్యాలు ఎలా ఉన్నా.. ఫీల్డ్‌లో అలా కనిపించడం లేదు. టీఆర్‌ఎస్‌ నోరెత్తితే బీజేపీని మాత్రమే తిడుతోంది. అంటే బీజేపీ తన ప్రత్యర్థి అని డిసైడైందా? ఇక బీజేపీ కూడా అధికార టీఆర్‌ఎస్‌ని మాత్రమే టార్గెట్‌ చేస్తోంది. అంటే కాంగ్రెస్‌ తన ప్రత్యర్థి కాదని బీజేపీ అనుకుంటోందా? ఎటు నుంచి ఎటు చూసినా కాంగ్రెస్‌పై చర్చ జరగడం లేదు. టీఆర్‌ఎస్‌, బీజేపీలపైనే చర్చ జరుగుతోంది.

నోట్ల కట్టల వ్యవహారంలో కూడా రెండు పార్టీలు తిట్టుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి, ఎంపీలు, మిగిలిన కేడర్‌ మొత్తం దిగిపోయి హంగామా చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. మంచికైనా.. చెడుకైనా.. తమ ఉనికి కనిపించేట్లు అటెన్షన్‌ డైవర్ట్‌ చేస్తోంది కమలం పార్టీ.

ఆ దూకుడు హస్తం పార్టీలో కనిపించడం లేదు. అధికార పార్టీ అయినా.. గెలుపుపై ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎక్కడా తగ్గడం లేదు. కొత్తగా ఎన్నికలకెళ్తున్న పార్టీలా శ్రమిస్తోంది. ఏదో ఉన్నానంటే ఉన్నాను తప్ప.. ఇదిగో నా సత్తా.. ఇదిగో నా ఉనికి అని కాంగ్రెస్‌ మెరుపులు మెరిపించలేకపోతోంది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని.. కాంగ్రెస్‌ కాదని చెప్పేందుకు దూకుడుగా వెళ్తోంది బీజేపీ. టీఆర్‌ఎస్‌ సైతం అంతే స్థాయిలో స్పందిస్తోంది. వార్‌ డైరెక్ట్‌ అయిపోయింది. కాంగ్రెస్‌ సీనియర్లు అంతా దుబ్బాకలోనే మకాం వేసినా ఆ రెండు పార్టీలపై జరుగుతున్నంత చర్చ కాంగ్రెస్‌పై లేదు. మేము గట్టి పోటీ ఇస్తున్నాం అని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటున్నా.. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అంతా మార్చేశాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కడ అన్న ప్రశ్న వినిపిస్తోంది. మరి.. ఫలితంపై క్లారిటీ వచ్చిందో.. లేక వార్‌ మనతో కాదని అనుకున్నారో ఏమో..ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకోవడం లేదన్న అన్న ప్రచారమూ మొదలైంది.

ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోయినా.. గట్టి పోటీ ఇవ్వకున్నా అది తమ పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కొత్త ఇంఛార్జ్‌, PCC చీఫ్‌ల నేతృత్వంలో కాంగ్రెస్‌ను కొత్తగా చూపిద్దాం అని ప్రతినబూనిన టీపీసీసీలో మొదట్లో ఉన్న ఊపు కనిపించడం లేదు. మరి.. ఫలితం ఎలా ఉంటుందో.. ట్రయాంగిల్‌ ఫైట్‌లో కాంగ్రెస్‌ అదృష్టం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news