జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సహ నిందితుల్ని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జులుగా పెట్టి భూ దోపిడీ చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. దోపిడీ సొమ్ముతో ఏ1 జగన్ ఇప్పటికే పత్రిక, ఛానెల్ పెట్టారని.. ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మాత్రమే తనకుందన్న విజయసాయి రూ. వెయ్యి కోట్లతో పత్రికా, ఛానల్ ఎలా పెట్టగలడు..? అని ఎద్దేవా చేశారు. సాక్షి మీద నమ్మకం లేకనే దోపిడీ సొమ్ముతో విజయసాయి మరో మీడియా సంస్థ ఏర్పాటు అంటున్నారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర.
క్యాసినోలు, క్రూజ్ లు, నిర్వహణ , ఢిల్లీ లిక్కర్ స్కాముల్లో సైతం విజయసాయి కుటుంబ సభ్యులే ఉన్నారు… విజయసాయి వైసీపీ ఎంపీ కాకుంటే ఇవన్నీ మూడున్నరేళ్లలో ఎలా సాధ్యం ? అని ప్రశ్నించారు. వీటిపై సమగ్ర విచారణ డిమాండ్ చేస్తున్నాం… ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువగా ఉన్నారంటున్న విజయసాయి పార్టీ ఇన్ఛార్జ్ గా బీసీలను ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము కాకుండా మరొకరి పరిశ్రమ రాకూడదన్న రీతిలో జగన్ వ్యవహారం ఉందన్నారు. ఏ2 విజయసాయి ద్వారా కాకినాడ సెజ్ లో అత్యధిక వాటాలు, కాకినాడ గెట్ వే పోర్టు, రామాయపట్నం పోర్టు పనులు, 108, 104 వాహనాలు వంటివి అరబిందో సంస్థకు దక్కేలా చేసింది వాస్తవం కాదా..? అని నిలదీశారు.