విజయదశమి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజైన ఇవాళ దుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా భక్తులకు కనువిందు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాల తొలి రోజు కావడంతో ఇవాళ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. కనకదుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ పోయి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం.
దేవీ నవరాత్రి ఉత్సవాల రెండో రోజు నుంచి ఉదయం 4 గంటల మొదలు రాత్రి 11 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. రోజూ సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతులు,చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. ఆ సమయంలో దర్శనాలను నిలిపేస్తారు.
ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని.. అక్టోబర్ రెండో తేదీ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.