Telangana: టీ శాట్‌ ద్వారా ఉచితంగా ఎంసెట్‌ పాఠాలు షురూ

-

ఎంసెట్ రాసే నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యం, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సర్కార్.. టీశాట్‌ ద్వారా ఎంసెట్‌ కోచింగ్‌ ఇస్తోంది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 5వ తేదీన శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.

ఎంసెట్‌కు సన్నద్ధమవ్వాలనుకుంటున్న పేద విద్యార్థులకు వేలాది రూపాయల రుసుములు చెల్లించి కోచింగ్‌ కేంద్రాల్లో శిక్షణ తీసుకునే స్తోమత ఉండదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల రచయితలు, నిపుణులతో టీ శాట్‌ ద్వారా రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎంసెట్‌ నిర్వహించే నాటికి సిలబస్‌ పూర్తయ్యేలా టైంటేబుల్‌ కూడా రూపొందించారు. శిక్షణ తీసుకుంటున్న ప్రతి విద్యార్థినికి ప్రత్యేక కోడ్‌ నంబరు కేటాయించి పీజీసీఆర్టీకి అనుసంధానించారు.

ఉన్నత విద్యనభ్యసించాలనే ఆశ ఉన్నా.. ఎంసెట్ కోచింగ్​కు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న తమకు ఇప్పుడు ఈ శాట్ ద్వారా పాఠాలు చెప్పడం ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు విద్యార్థులు అంటున్నారు. కచ్చితంగా ఈ పాఠాలు శ్రద్ధగా విని ఎంసెట్​లో మంచి ర్యాంకు తెచ్చుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news