చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. 15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. కాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి.
అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల క్రితం జపాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. జపాన్‌లోని పెద్ద ద్వీపకల్పమైన హోన్షుకి దక్షిణ తీరంలోని కన్సాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. మై ప్రెఫెక్టర్ దగ్గర 357 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.