క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డి తోపాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో ఇద్దరు హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
అంతేకాకుండా ఏడాది వ్యవధిలో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లను నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్‌లో ప్రవీణ్ మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు.
హవాలా మార్గంలో డబ్బులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికోసం బేగంబజార్, జూబ్లీహిల్స్‌కి చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సాయం తీసుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలో ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు.