అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే బిఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ దాదాపు రెడీ అయిపోయింది. సిఎం కేసిఆర్..బిఆర్‌ఎస్ అభ్యర్ధుల పేర్లని ఖరారు చేసినట్లు సమాచారం. అక్కడక్కడ కొన్ని మార్పులు మినహా మిగతా నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయిట్ సుమారు 10-15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని కేసిఆర్ పక్కన పెట్టినట్లు తెలుస్తోందో. బాగా ప్రజా వ్యతిరేకత ఉండటం, వారికి సీటు ఇచ్చిన గెలవరని సర్వేల్లో తేలడంతో తప్పనిసరి పరిస్తితుల్లో వారిని కేసిఆర్ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఎవరికైతే సీటు దక్కదో వారితో కేటిఆర్, హరీష్ రావు టచ్ లో ఉంటూ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే వారికి కీలక పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఆ స్థానాల్లో బిఆర్‌ఎస్ నేతలకు మరోక విధంగా ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు మాజీ ఎమ్మెల్యేలని బుజ్జగిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ వారు పార్టీ మారాలని డిసైడ్ అయితే..ఆ స్థానాల్లో ఉండే ద్వితీయశ్రేణి కేడర్ చేజారిపోకుండా చూసుకోవాలని బిఆర్‌ఎస్ అధిష్టానం చూస్తుంది. ఇలా ఎక్కడక్కక్కడ సీటు దక్కని వారిని బుజ్జగిస్తూనే..దాదాపు 80 సీట్ల వరకు ఖరారు చేసినట్లు సమాచారం. మొదట విడతలో ఏ లిస్ట్ విడుదల చేయనున్నారు. ఇక మరి ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే సీట్లని పెండింగ్ లో పెట్టి, వాటిని తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇక కమ్యూనిస్టులతో పొత్తుకు కేసిఆర్ సిద్ధంగానే ఉన్నారని తెలిసింది. సిపిఐ, సిపిఎంలకు చెరోక సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. మునుగోడు, మిర్యాలగూడ, భద్రాచలం, బెల్లంపల్లి సీట్లలో ఏవైనా రెండు సీట్లు కమ్యూనిస్టులకు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. అలాగే అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ పదవులు కూడా కమ్యూనిస్టులకు ఇవ్వాలని చూస్తున్నారట. కానీ కమ్యూనిస్టులు రెండేసి అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద బిఆర్‌ఎస్ అభ్యర్ధులని కేసిఆర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ లిస్ట్ వస్తుంది.