ఎడిట్ నోట్: జగన్ ‘పేద’ సెంటిమెంట్!

రాజకీయాల్లో సెంటిమెంట్ అస్త్రం అనేది ఎప్పుడుపడితే అప్పుడు ఉపయోగపడటం కష్టమే. ఏదో కొన్ని సార్లు మాత్రమే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. మళ్ళీ మళ్ళీ వర్కౌట్ అవుతుందంటే అది రాజకీయమే అనాలి. పైకి సెంటిమెంట్ ఉంటుంది గాని..వెనుక మాత్రం రాజకీయమే అని చెప్పాలి. ఉదాహరణకు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు..మూడోసారి కూడా అదే విధంగా ముందుకెళితే దెబ్బతినడం ఖాయం..అందుకే కేంద్రాన్ని ఒక శత్రువుగా భావించి..కేంద్రంపై ఫైట్ చేస్తూ..ప్రజల మద్ధతు పొందాలని చూస్తున్నారు. సరే ఈ అంశంలో కే‌సి‌ఆర్ సక్సెస్ అవుతారో లేదో కొన్ని నెలల్లో తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీలో జగన్..మొదట వైఎస్సార్ సెంటిమెంట్ తో పార్టీ పెట్టారు. ఉపఎన్నికల్లో గెలిచారు. తాను జైలుకు వెళ్ళిన సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కానీ 2014 ఎన్నికల్లో అది వర్కౌట్ కాలేదు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి..ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్ జగన్‌కు కలిసొచ్చింది. తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని ప్రజలని జగన్ కోరారు. ప్రజలు సైతం జగన్ పాలన ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామని, పైగా టి‌డి‌పిపై వ్యతిరేకతతో వైసీపీకి వన్ సైడ్ గా ఓట్లు వేసి గెలిపించారు.

ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారు. జగన్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారో లేదో ప్రజలకే తెలియాలి. అయితే తాను మాత్రం అంతా మంచే చేస్తున్నానని, ప్రజలంతా తనకే అండగా ఉంటారని జగన్ అంటున్నారు. అలాగే తాను పేదలకు అండగా ఉంటున్నానని, వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని, తాను ఎప్పుడు పేదల పక్షాన ఉంటానని చెబుతున్నారు.

ఇక్కడ జగన్ పేదల సెంటిమెంట్‌తో ముందుకొస్తున్నారు. అంటే పథకాల ద్వారా డబ్బులు ఇచ్చి పేదలకు మేలు చేశాననేది జగన్ చెబుతున్నది. అయితే పథకాలు ఇవ్వడం వల్ల పేదలు బాగుపడ్డారా..వారు రోడ్లు, తాగునీరు, అభివృద్ధి కోరుకోవడం లేదా? అలాగే పన్నుల భారం వల్ల వాళ్ళు ఏమి ఇబ్బంది పడటం లేదా? అంటే అది పేద ప్రజలకే బాగా తెలుసు.

పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. రోడ్లు బాగుపడాలని, కనీసం తాగునీరు అందాలని కోరుకుంటారు. మరి ఆ వసతులు పూర్తి స్థాయిలో ఉన్నాయా? అంటే లేవనే చెప్పవచ్చు.  కాబట్టి జగన్ పదే పదే పేదలతోనే తన ప్రయాణం అని చెప్పినంత మాత్రాన పేద వర్గాలు ఓట్లు పడిపోతాయని అనుకోవడం కష్టమే. చూడాలి మరి జగన్ సెంటిమెంట్ ఏ మేర వర్కౌట్ అవుతుందో.