పదవులు వచ్చే వరకూ మాట్లాడండి.. పదవులు వచ్చాక మాట్లాడకండి. బాధ్యతలు అందుకున్నాక మీలో రాగద్వేషాలు బయటకు వస్తున్నాయా లేదా రాగద్వేషాలకు అతీతంగా గౌరవ అమాత్యులు ఎవ్వరూ ఉండలేకపోతున్నారా? ఓ అంబులెన్స్ మాఫియాను నిలువరించలేక పోతున్నారు. ఇదెంత మాత్రం ఒప్పుకోదగ్గ విషయం కాదు. ఓ సాధారణ ఆస్పత్రిని అసాధారణ స్థాయిలో తీర్చిదిద్దడం అస్సలు అంగీకారంలో లేని పనిగానే మిగిలిపోతోంది యంత్రాంగానికి.. ! ఆస్పత్రి అంటే కోవెల.. కోవెల చెంత ఉన్న ఆస్పత్రి అంటే ఇంకేం రాయాలి. ఇల వైకుంఠ పురిలో విషాదాలను తొలగించడం బాధ్యత.. ఓ బాధ్యత గల అమాత్యురాలి బాధ్యత. ఎందుకనో ఆమె మాట్లాడడం లేదు.
విడదల రజనీ గారూ మీరు మాట్లాడితే కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మీరు ఘటనా స్థలికి వెళ్లి మాట్లాడి వస్తే ఇంకొన్ని సమస్యలకు పరిష్కారం తప్పక దొరుకుంది. ఆ తండ్రికి ఇప్పుడు పుత్ర శోకం. చావు, పుట్టుకలు ఎవ్వరు అతీతం కాదు అని అంటారు. కానీ మరణించాక కొన్ని వైరుధ్యాలు కొన్ని మాఫియాలు ఇంకా మనపై మరో మరణ శాసనం లిఖిస్తాయి. కానీ ప్రభుత్వాధికారులు వాటిని పట్టించుకోరు. ఇవన్నీ షరామాములే అని అనుకుని యథాలాపంగా ఉంటారు. నిర్లక్ష్య ధోరణికి సంకేతంగా ఉంటారు. కొన్ని ఘటనలు మాట్లాడతాయి. కొందరు మనుషులు మాట్లాడతారు. కొన్ని సార్లు అవసరాలు మాట్లాడతాయి..కొన్ని సార్లు బాధలు మాట్లాడిస్తాయి.
బాధ్యతలు మాట్లాడిస్తాయి. పోరాట శైలిని నేర్పిస్తాయి కూడా ! కొన్ని సార్లే మనుషులు తమని తాము మార్చుకునేందుకు దేవుడు కూడా ఓ అవకాశం ఇచ్చిచూస్తాడు కూడా ! దేవుడయినా కొన్ని సార్లే బిడ్డలను కనికరిస్తాడు. లోకానికి దయను ప్రసాదించే వేళ అది పరివ్యాప్తం కావాలని ఆశిస్తాడు. దురదృష్టం ఏంటంటే మనుషులం కదా అవేవీ అర్థం చేసుకోం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం. ప్రాయిశ్చిత్తం అన్నదే ఉండదు. కేవలం మనం మనుషులం అన్నదే గుర్తుకు ఉంటే చాలు.. అదే పెద్ద ప్రక్రియ లేదా పని. నెత్తికెక్కినవి ఏవీ అంత వేగంగా దిగవు. అధికారం ఏమయినా గొప్పనయిన ఆనందమా లేదా బాధ్యతా .. అధికారం ఓ సామాన్య స్థితి. సామాన్యుడికి ఉపయోగపడే స్థితి లేదా హోదా అని రాయాలి. ఇంకా చెప్పాలంటే ప్రజా స్వామ్యంలో ఓ సామాన్యుడు వేసిన భిక్ష అధికారం. కానీ మన నాయకులకు ఇవి పట్టవు. కనుక బిడ్డల శోకం తీరదు. తండ్రుల శోకం తీరదు. తీరడం లేదు కూడా !