గత రెండు, మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు నడిచే పోరులో సడన్‌గా షర్మిల ఎంట్రీ ఇచ్చారు. దీంతో రెండు రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ షర్మిల అన్నట్లు రాజకీయం మారింది. ఒక్కసారిగా షర్మిల పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగింది. నిజానికి షర్మిలకు కూడా కావాల్సింది ఇదే. ఆమె హైలైట్ అయితేనే..ఆమె పార్టీకి మైలేజ్ వస్తుంది.
నిజానికి వైఎస్సార్టీపీ పెట్టిన దగ్గర నుంచి పెద్దగా బలపడలేదు. ఇక షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, దీక్షలు చేస్తూ, పాదయాత్ర చేస్తూ ముందుకెళుతున్నారు. అయినా సరే షర్మిల రాజకీయాలని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ రాజకీయం ఎక్కువగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయ ఇబ్బందులతో హైలైట్ అవుతుంది. అంతే గాని షర్మిల హైలైట్ కాలేదు. కానీ ఆమె ఎప్పటికప్పుడు హైలైట్ అవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లినట్లు కనిపించారు.
అందుకోసం ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేని గాని, మంత్రిని గాని గట్టిగా టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లని రెగ్యులర్‌గా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలని టార్గెట్ చేయడమే కాదు తీవ్రమైన విమర్శల దాడి చేస్తూ వచ్చారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు చేశారు. పర్సనల్‌గా కూడా టార్గెట్ చేసేశారు. దీంతో అటు నుంచి కూడా షర్మిలకు కౌంటర్లు వచ్చాయి. కాకపోతే కొందరు మంత్రులే ఘాటుగా స్పందించారు. మిగతావారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో షర్మిల అనుకున్న విధంగా హైలైట్ కాలేదు.
కానీ తాజాగా నర్సంపేటలో పాదయాత్ర చేస్తూ..అక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గట్టిగా టార్గెట్ చేసి..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు తిరగబడ్డాయి..షర్మిల పాదయాత్రపై రాళ్ళతో దాడి చేశారు. క్యారవాన్‌కు నిప్పు పెట్టారు. ఇక పోలీసులు కూడా టీఆర్ఎస్ శ్రేణులని అదుపు చేయకుండా వదిలేసి..షర్మిలని అదుపులోకి తీసుకుని పాదయాత్రకు బ్రేక్ వేశారు.
అలా అని షర్మిల వెనక్కి తగ్గలేదు. తన పగిలిన కారుని ప్రగతి భవన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక రోడ్డు మీదే పోలీసులు..షర్మిల కారుని ట్రాఫిక్ వెహికల్‌కు కట్టి స్టేషన్‌కు తీసుకెళ్లారు. షర్మిలని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కు నిరసనగా విజయమ్మ దీక్షకు దిగారు. ఇక ఒకరోజు ఉంచి షర్మిలని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇలా రెండురోజుల పార్టు జరిగిన సంఘటనలతో షర్మిల ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు.
వాస్తవానికి షర్మిల టాపిక్‌తో పాటు బండి సంజయ్ భైంసా పాదయాత్ర కూడా హడావిడి అయింది..కాకపోతే అది ఒకరోజే ఉంది. తర్వాత పాదయాత్ర జరిగింది. సభ కూడా జరిగింది. కానీ ఆ అంశాలని షర్మిల టాపిక్ కవర్ చేసేసింది. మొత్తానికి టెన్షన్‌తో షర్మిల అటెన్షన్ తెచ్చుకున్నారు.