కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. గత ఏడాది విద్యార్థులను చాలా వరకు పరీక్షలు లేకుండా పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఇక కనీసం ఈ ఏడాది నుంచి అయినా క్లాసులు జరుగుతాయి, పరీక్షలు రాస్తామని విద్యార్థులు ఎదురు చూశారు. కానీ ఈసారి కూడా కోవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో గతేడాది లాగే విద్యార్థులను పాస్ చేశారు. ఈ క్రమంలో అసలు కరోనా ఎప్పుడు తగ్గుతుంది ? మళ్లీ క్లాసులు జరుగుతాయా ? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఆంటోనియో గుటెరస్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సుమారుగా 156 మిలియన్ల మందికి పైగా విద్యార్థులపై కోవిడ్ ప్రభావం పడిందన్నారు. 25 మిలియన్ల మంది మళ్లీ చదువుకునే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో విద్యారంగంలో ఉపాధ్యాయులు, డిజిటల్ లెర్నింగ్, వ్యవస్థ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడితే తప్ప ప్రయోజనం ఉండదని తెలిపారు.
ఇలా విద్యారంగం సంక్షోభంలో ఉన్నందున విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచైనా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని, వారి చదువులుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేదంటే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.