హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల రాజేందర్ కలవనున్నారు. ఇందుకు కోసం ఈటల రాజేందర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈటల రాజేందర్‌తో పాటు పలువురు నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక ఈటల తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. ఉదయం 11.30 గంటలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకరు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు కాషాయ కండువా వేయనున్నారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల కలుస్తారు.
ఇక ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, అందె బాబయ్య తదితరులు కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల రాజేందర్ నేరుగా మంగళవారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.