పోలీసు వాహనంపై జరిగిన దాడిలో ఎనిమిది మంది అధికారులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన నైరుతి కొలంబియాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో ధ్రువీకరించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి హేయమైన చర్యలు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ దాడిపై విచారణ జరుపుతున్నామని పెట్రో తెలిపారు. దీని వెనుక ఉన్నదెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా- పీపుల్స్ ఆర్మీ అనే గెరిల్లా గ్రూపు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
మరోవైపు.. కొలంబియా అధ్యక్షుడిగా ఆగస్టు 7న గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దేశ చరిత్రలో మొదటి వామపక్ష నాయకుడు. పేదరికాన్ని అరికడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే గెరిల్లా పోరాట యోధులతో చర్చలకు జరుపుతానని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులపై దాడి జరగడం గమనార్హం.