జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత అని ప్రతి సర్కిల్లో ఎన్నికల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత సంబంధిత డిప్యూటీ కమిషనర్లదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు. ఈరోజు ఆయన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీహెచ్ఎంసీ కమిషనర్, నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన ఈ సమావేశంలొ ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ తేదీ మొదలు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు డిప్యూటీ కమిషనర్లు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఎటువంటి అలసత్వం జరిగినా సహించబోమని ఆదేశించారు.
ఈ నెల 13న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, ఏ ఓటరు కూడా పోలింగ్ రోజున ఇబ్బంది పడకుండా ఓటరు లిస్ట్ ఉండాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని, వోటింగ్ కంపార్టుమెంట్ లో వెలుతురు సరిగా ఉండేలా చూడాలని, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఇన్స్ పెక్ట్ చేస్తుందని ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లైతే సంబంధిత డిప్యూటీ కమిషనర్ లు, రిటర్నింగ్ అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.