కరోనా వచ్చిన తర్వాత ఒకచోటు నుండి మరొక చోటుకి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. కరోనా వచ్చినప్పటి నుండి ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కూడా. ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవడం, మీటింగులన్నీ ఆన్ లైన్లో జరుపుకోవడం అలవాటైపోయింది. ఆన్ లైన్లో చదువులు, ఆన్ లైన్లో పనులు.. అన్నీ ఆన్ లైన్లోనే జరుపుకుంటూ మనుషులకి దూరమైపోతున్నారు. ఐతే మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో మనుషులకి దూరమైనా, డిజిటల్ సేవల ద్వారా మానసికంగా దగ్గర కాగలుగుతున్నారు.
ఈ డిజిటల్ సేవలని మరింత విస్తృతం చేస్తూ, మహమ్మారి తీసుకువచ్చిన నష్టాలని పూడ్చడానికి, అనంతార గోల్డెన్ ట్రయాంగిల్ ఎలిఫెంట్ సరికొత్త ఆలోచనతో వచ్చింది. గోల్డెన్ ట్రయాంగిల్ ఎలిఫెంట్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం చేసుకుని, ఈ ఆలోచనని ముందుకు తీసుకువచ్చింది. ఎలిఫెంట్ ఇన్ ద జూమ్ అనే పేరుతో జూమ్ వీడియో కాల్స్ ద్వారా ఏనుగులతో మధ్య జీవించే అవకాశాన్ని కల్పిస్తుంది. క్రిస్టమస్, కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా ఈ వింత ఆలోచనతో వస్తున్నారు.
ఈ కాల్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడవుల్లో ఏనుగుల అలవాట్లు, వాటితో పాటు సందర్శకులకి అడవిలో తిరుగుతున్న ఫీలింగ్ ఇవ్వనుంది. పండగ సందర్భంగా ఈ గిఫ్ట్ ని మీ ప్రియమైన వారికి కూడా అందజేయవచ్చట. ఒక మంచి అనుభవంతో పాటు అడవుల రక్షణ, ఏనుగుల సంరక్షణకి ఎంతో కొంత డబ్బులు విరాళంగా ఇచ్చినట్టు అవుతుందిట. మిగతా వివరాలన్నీ వెబ్ సైట్ లో చూడవచ్చు.
మొత్తానికి కరోనా కారణంగా ఉన్న చోటి నుండి కదలకుండా ప్రపంచాన్నే చూసేస్తున్నారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో..!