గెలుపు గుర్రాలను బరిలో దింపి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది అధికార టీఆర్‌ఎస్. కొన్ని డివిజన్లకు ఇంఛార్జులుగా మంత్రులను పెట్టి పోల్ మేనేజ్‌మెంట్‌లో సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది. టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఈ విధంగా ఎన్నికల రణతంత్రం రచిస్తే.. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మరో రూట్ ఎంచుకున్నారట. ఆ కొందరు ఎమ్మెల్యేలలో ఇద్దరి బండారం బయటపడిపోయిందని సమాచారం. వారు చేసిన పని తెలుసుకుని టీఆర్‌ఎస్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయట.
గ్రేటర్ హైదరాబాద్‌లో గీత దాటిన ఆ ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. వారికంటూ సొంత అనుచర గణం ఉంది. తమ నాయకులు ఏ పార్టీలోకి వెళ్తే.. వారిని ఫాలో అవ్వడమే అనుచరుల పని. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు… గ్రేటర్ ఎన్నికల్లో తమ వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునేందుకు శతవిథాలా ప్రయత్నించి విఫలమయ్యారట. ముందు నుంచీ టీఆర్‌ఎస్‌లో ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్లు ఇచ్చింది పార్టీ. దీంతో అసంతృప్తిలో ఉన్న అనుచరులను బుజ్జగించేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు సదరు ఎమ్మెల్యేలు.
అనుచరులను బీజేపీలోకి పంపించి.. తమ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనే బరిలో నిలిపారట ఎమ్మెల్యేలు. పైగా ఇది ఎవరికీ తెలియదులే అనుకున్నారట. కానీ.. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా టీఆర్‌ఎస్ పెద్దలకు తెలిసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆశ్చర్యపోవడమే కాదు.. ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. వెంటనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని ప్రశ్నించారట. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు అతి తెలివికిపోయి చెప్పిన సమాధానం బెడిసి కొట్టిందని సమాచారం.
పార్టీ పెద్దలు ఆరా తీసిన సమయంలో.. తమ అనుచరులు బీజేపీ నుంచి బరిలో దిగిన మాట వాస్తవమే అని అంగీకరించారట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతేకాదు.. ఒకవేళ వారు బీజేపీ నుంచి గెలిస్తే.. వెంటనే టీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారట. ఇలా చెప్పడం వల్ల పార్టీ పెద్దలు ఖుషీ అవుతారని లెక్కలు వేసుకున్నారు ఎమ్మెల్యేలు. కానీ.. వారికి ఊహించని షాక్ ఇచ్చారట పార్టీ పెద్దలు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించకుండా.. అనుచరులను వేరే పార్టీ నుంచి పోటీ చేయించడం ఏంటని ఎమ్మెల్యేలను ప్రశ్నించారట. గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌లోకి కార్పొరేటర్లు రావడం సెకండరీ. ఒకవేళ వాళ్లు బీజేపీ నుంచి గెలిస్తే.. అది ఆ పార్టీ ఖాతాలో పడుతుందని.. ఆ చిన్న లాజిక్కు ఎలా మిస్ అయ్యారని అక్షింతలు వేశారట.
పార్టీ పెద్దలు తీసుకున్న క్లాస్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు… బీజేపీ నుంచి బరిలో ఉన్న తమ అనుచరులను స్లో అవ్వాలని చెప్పారట. అయితే రాకరాక పోటీ చేసే అవకాశం వచ్చిందన్న సంబరంలో ఉన్న అనుచరులు ఈ దశలో ఎంత వరకు తమ నేత మాట వింటారన్నది డౌటే అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ విషయంలో బయటపడ్డారు. ఇలాంటి వారు మరికొందరు ఉండొచ్చనే అనుమానంతో గులాబీ పెద్దలు ఆరా తీస్తున్నారట. మరోవైపు ఈ సంగతి కమలనాథుల చెవిలో కూడా పడటంతో.. ఆ శిబిరంలో కలకలం మొదలైందట. బరిలో ఈ తరహా బాపతు ఎంత మంది ఉన్నారా అని ఆరా తీస్తున్నారట బీజేపీ నాయకులు.