పీఆర్సీ : బుజ్జ‌గింపే త‌గువుకు ముగింపా?

-

ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం అంత‌టా వినిపిస్తున్న మాట పీఆర్సీ.కొత్త పీఆర్సీ వ‌ద్దు పాత జీతం ముద్దు అని ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌డుతున్న వైనం తెలిసిందే.వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉద్య‌మించాల‌ని ఉద్యోగ సంఘాలు నిర్ణ‌యించాయి.ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన జీఓలు ఉప‌సంహ‌రించుకునే వ‌ర‌కూ ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేయాల‌నే సంకల్పించాయి.

వేర్వేరు ద‌శ‌ల్లో ఉద్య‌మించి త‌రువాత ఫిబ్ర‌వ‌రి ఏడు లేదా ఎనిమిదో తారీఖు నుంచి స‌మ్మెకు వెళ్లాల‌ని యోచిస్తున్నారు ఉద్యోగులు.ఇందులో భాగంగా ఈ నెల 23న రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలూ, ధ‌ర్నాలూ నిర్వ‌హించి ఈ నెల 26న అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు విన‌తులు అందిస్తారు.ఈ నెల 27 నుంచి 30 వ‌ర‌కూ నిరాహార దీక్ష‌లు చేయ‌నున్నారు.ఫిబ్ర‌వ‌రి ఐదున పూర్తి స్థాయిలో స‌హాయ నిరాక‌ర‌ణ పేరిట పెన్ డౌన్ చేయాల‌ని నిర్ణయించారు.

అటుపై స‌మ్మెకు పిలుపునిచ్చి ఉద్య‌మం ఉద్ధృతిని పెంచనున్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా మంత్రులు మాత్రం తాము చెప్పాల‌నుకు న్న‌దేదో చెబుతూనే ఉన్నారు.శాంతియుతంగా ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల‌ను జ‌ఠిలం చేయ‌వ‌ద్ద‌ని, భాష జాగ్ర‌త్త‌గా వాడాల‌ని ఆయా సంద‌ర్భాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వ‌ర్గాల‌ను సంబంధిత నాయ‌కులే నియంత్రించాల‌ని కూడా బొత్స లాంటి వారు చెబుతున్న సూచ‌న.

ఈ ద‌శ‌లో కొత్తగా మ‌రో ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర‌పైకి వచ్చింది.ఉద్యోగ సంఘాల‌తో మాట్లాడేందుకు,వారితో సంప్ర‌తింపులు జ‌రిపేందుకు ఒక ఫైవ్ మెన్ క‌మిటీ వేశారు.ఇందులో ఆర్థిక మంత్రి బుగ్గ‌న‌, బొత్స, పేర్ని నాని తో పాటు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల,సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఉండనున్నారు.వీరితోనే ఉద్యోగ సంఘాలు చ‌ర్చ‌లు జ‌రిపి విష‌యాన్ని ఓ కొలిక్కి తీసుకురావాల్సిన వారిపై బాధ్య‌త ఉంది.మ‌రి! వీరి మాట నెగ్గుతుందా లేదా ఉద్యోగుల మాట నెగ్గుతుందా? ఇప్ప‌టికే అనేక ప‌ర్యాయాలు పీఆర్సీపై చ‌ర్చించి విసిగిపోయిన ఉద్యోగులు సీఎస్ తో మాట్లాడి సాధించేదేంటి అన్న డైల‌మా కూడా కొన‌సాగుతోంది.

ఉద్య‌మం అంటూ రోడ్డెక్కా ఈ త‌రుణంలో చ‌ర్చ‌కు వెళ్లాలా వ‌ద్దా అన్న ఆలోచ‌న కూడా కొంద‌రు ఉద్యోగుల్లో ఉంది.ఏక‌ప‌క్షంగా పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న మాట కూడా ఉద్యోగ సంఘాల నుంచి వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న మ‌రో వాద‌న. అందుకే స‌మ‌స్య ప‌రిష్క‌రించేందుకు ఫైవ్ మెన్ క‌మిటీని క‌లిసి మాట్లాడ‌లా వ‌ద్దా అన్న సంశ‌యం ఉన్నా కూడా కొంద‌రు మాత్రం చ‌ర్చ‌ల‌కు సై అంటూనే ఉన్నారు.గొడ‌వ పెద్ద‌ది చేసుకున్నా వ‌చ్చే లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ ఉంటుంది క‌నుక మ‌ధ్యేమార్గంగా చ‌ర్చ‌ల‌కు వెళ్లేందుకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.మాట్లాడుకుంటే పోయేవే క‌దా ఇవ‌న్నీ వీటిపై ఉద్య‌మాలు ఎందుకు జ‌నం ద‌గ్గ‌ర చుల‌క‌న అయిపోయి త‌రువాత బాధ‌ప‌డ‌డం అని కూడా పేర్నినాని లాంటి వారు ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు.ఆ మాట ఈ మాట అనుకుని ఎవ్వ‌రూ స‌జావుగా సాధించేదేమీ ఉండ‌దు క‌నుక చర్చ‌లకు పోతేనే ఇరు వ‌ర్గాల‌కూ మేలు.

Read more RELATED
Recommended to you

Latest news