ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. వీలున్నంత వరకూ మార్పు అన్నది వస్తూ ఉంటుంది. వీలైనంత వరకూ కొత్త పార్టీల పుట్టుక కూడా సాధ్యం అవుతూనే ఉంటుంది. రెండు జాతీయ పార్టీలు ఇవాళ తమ మనుగడ కోసం బాగానే ప్రయత్నిస్తున్నాయి. అవి విజయం సాధించినా, సాధించకపోయినా ప్రజల కోసం కాస్తో కూస్తో మాట్లాడుతున్నాయి. వీటి వెనుక ఎన్ని రాజకీయ ఉద్దేశాలు ఉన్నా, ఎన్ని స్వార్థ ప్రయోజనాలు అన్నవి దాగి ఉన్నా, ఉన్నంత మేరకు తమ పార్టీల ఉనికిని చాటేందుకు గొంతుకలు వినిపిస్తున్నాయి. ఇవేవీ కాదని అస్సలు అవి ఏ పాటి కూడా తమ సత్తా చాటలేవని, వస్తున్న కాలమంతా తమదేనని టీఆర్ఎస్ చెప్పడమే హాస్యాస్పదం.
అన్ని రోజులూ మావే అంటున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ తెచ్చిన పార్టీగా రానున్న కాలంలో జయకేతనం ఎగువ వేయడం ఖాయమని కూడా చెబుతోంది. ఏదేమయినప్పటికీ విపక్షాలను ఉద్దేశించి అతి విశ్వాసంతో చెబుతున్న మాటలే వివాదాలకు తావిస్తున్నాయి. తమ దృష్టిలో అవి విపక్షాలే కావు అని, తెలంగాణలో మళ్లీ మళ్లీ అభివృద్ధి వాదం వినిపించాలి అన్నా, ప్రగతి వికసించాలి అన్నా తమతోనే సాధ్యం అని అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ చెబుతున్నారు. అచ్చం ఆ మాటలనే ఎర్రబెల్లి దయాకర్ లాంటి లీడర్లు వల్లెవేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ తమకు పోటీ కానేకావని చెబుతున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని కూడా జోస్యం చెబుతున్నారు. మరి ! ఈ మాటల వెనుక అంతరార్థం ఏంటి ? అంటే వచ్చే ఎన్నికల్లో కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ టీఆర్ఎస్-కు బలమైన ప్రతిపక్షాలు కావని అంటున్నారా లేదా ఆ స్థాయిలో అవి పనిచేయకుండా కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఎర్రబెల్లి భావిస్తున్నారా ? వాస్తవానికి తెలంగాణ వాకిట అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత అన్నది ఉందని, కానీ దీనిని కప్పిపుచ్చు కునేందుకు ఇటువంటి మాటలు చెప్పడం మాత్రం భావ్యం కాదు.అని అంటోంది విపక్షం.