ర్యాపిడ్ టెస్టులు అవసరం లేదు.. స్పష్టం చేసిన ఈటల

-

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలు తెలంగాణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశాయని వెల్లడించారు. ఈ రోజు కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరిందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకు 374 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 25 మంది మృతిచెందారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 610 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ కూడా ర్యాపిడ్ టెస్టులు చేయలేదని ఈటల స్పష్టం చేశారు. లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని.. ర్యాపిడ్ టెస్టులు చేయబోమని తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులకు కరోనా టెస్టులకు అనుమతించబోమని తెలిపారు. కరోనా కేసులు తక్కువగా చేసి చూపుతున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. తెలంగాణలో కరోనా కేసులు దాచిపెట్టలేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా మరణాల రేటు 3.2శాతం ఉండగా, రాష్ట్రంలో 2.5 శాతం మాత్రమేనని చెప్పారు.

లాక్‌ డౌన్‌ను పక్కాగా అమలు చేయడం వల్లనే కరోనా సామాజిక వ్యాప్తి చెందలేదని అన్నారు. మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని ప్రజలను కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news