ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుతుంది. అలాగే కరోనా వైరస్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీంతో పలు దేశాలు ఆంక్షలను ఎత్తేస్తున్నారు. అంతే కాకుండా కరోనా నిబంధనలను కూడా సడలిస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రభుత్వం తమ దేశంలో పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను ఎత్తివేయడానికి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతుంది. తాజా గా సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం కూడా కరోనా నిబంధనలు, ఆంక్షలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా లక్షణాలు లేకుంటే.. ఐసోలేషన్ అవసరం లేదని ప్రకటించింది.
వారు బయట తిరగవచ్చని తెలిపింది. టెస్టులో పాజిటివ్ గా వచ్చి.. లక్షణాలు ఉంటేనే ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది. అలాగే కరోనా సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్ కూడా లక్షణాలు లేకుంటే క్వారైంటెన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే పాఠశాలలో భౌతిక దూరం ఉండాలనే కరోనా నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. కాగ తమ దేశంలో పౌరులకు దాదాపు 70 నుంచి 80 శాతం రోగ నిరోధక శక్తి ఉందని తమ సర్వేలలో తెలిందని ప్రకటించారు. దీంతో కరోనాతో ఎవరికీ కూడా నష్టం జరగకపోవచ్చని అభిప్రాయ పడ్డారు.