దేశంలో రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వస్తే కచ్చితంగా కరోనా జాగ్రత్తలను పాటించాలని అంటున్నారు. ముఖ్యంగా మాస్కులను ధరించడం, సామాజిక దూరం పాటించడం చేయాలంటున్నారు. అయితే కోవిడ్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక్క మాస్కు కాకుండా రెండు మాస్కులను ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా ఒక సర్జికల్ మాస్క్ ధరిస్తే 56.1 శాతం వరకు కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. అదే ఒక క్లాత్ మాస్కు అయితే 51.4 శాతం వరకు రక్షణను అందిస్తుంది. అయితే రెండు మాస్కులను ధరిస్తే 85.4 శాతం వరకు కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. అంటే చాలా వరకు కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరూ రెండేసి చొప్పున మాస్కులను ధరించాలని చెబుతున్నారు.
ఇక మాస్కులను ధరించే వారు ముక్కు, నోరు భాగాలను పూర్తిగా కప్పి ఉంచేలా మాస్కులను ధరించాలి. మాస్కులను తీసేటప్పుడు ముందుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి. తరువాతే మాస్కులను తీయాలి. అలాగే మాస్కులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. క్లాత్ మాస్కులు అయితే శుభ్రం చేసి తిరిగి వాడవచ్చు. అదే సర్జికల్ మాస్కులు అయితే నిర్ణీత కాలం పాటు వాడాక వాటిని పడేసి కొత్త మాస్కులను ధరించాల్సి ఉంటుంది.