ఆలిండియా సర్వీస్ అధికారులు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల చూపు బీజేపీపై పడింది. సర్వీస్ పూర్తయిన తర్వాత కొందరు.. రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటే సర్వీస్ పూర్తికాకుండానే మరికొందరు కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నారు. గతంలో మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బీజేపీలో చేరారు. మళ్లీ ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉపఎన్నిక సమయంలో మళ్లీ అలాంటి అధికారుల తాకిడి మళ్లీ పెరిగిందట. ఓ మాజీ సీఎస్ పోటీకి గ్రౌండ్ వర్క్ సైతం సిద్దం చేసుకుంటున్నారట…
ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఆయన పేరు తిరుపతి బైపోల్స్ సమయంలో బలంగా వినిపించింది. ఆ తర్వాత బీజేపీ తరపున మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఆయన అభ్యర్థిత్వాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఆయన గతంలో జనసేన అభ్యర్ధిగా పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.
ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ..కర్ణాటక కేడర్ ఐఏఎస్ గా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆమెకు ఫైర్ బ్రాండ్ ముద్రకూడ ఉంది. పేరొందిన రత్నప్రభ అయితేనే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఉభయ పార్టీలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కర్నాటకలో పనిచేస్తున్న సమయంలోనే రత్నప్రభ బీజేపీకి దగ్గరైనట్టు సమాచారం. ఆ విధంగా తిరుపతి ఉపఎన్నికల్లో రత్నప్రభ పేరు పరిశీలనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించగా., అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అనూహ్యంగా మాజీ సీఎస్ రత్నప్రభ తెరపైకి వచ్చారు. మరికొందరు బ్యూరోక్రాట్లు సైతం బీజేపీలో చేరికకు ఆసక్తి కనబరుస్తున్నారట. కాకపోతే కొందరు నేరుగా బీజేపీతో టచ్లోకి వెళ్తుంటే.. ఇంకొందరు RSS పెద్దల ద్వారా పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారట.