ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొందరు నేతలకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో తలబొప్పి కట్టిన ఈ మాజీ మంత్రి వర్యుల పై మరో నేత ఫోకస్ పెట్టాడట. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అయినా తన ఇమేజ్ ని అధికారపార్టీ నేతలు టార్గెట్ చేయడంతో స్థానిక ఎన్నికల వేళ తెగ టెన్షన్ పడుతున్నారట మాజీ మంత్రి వర్యులు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయినా.. మళ్ళీ యాక్టివ్ అయ్యారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వేదిక ఏదైనా ప్రభుత్వంపై విరుచుకుపడటమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు సవాళ్లు విసురుతున్నారు. అలాంటి దేవినేని ఉమాకు స్థానిక ఎన్నికలు తీవ్ర కలవరపాటు కలిగిస్తున్నాయట. పంచాయతీ ఎన్నికల్లో దేవినేని దూకుడుకు బ్రేకులు వేసిన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరింత ఫోకస్ పెట్టిందట.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు మెజారిటీ పంచాయతీలను ఎగరేసుకుపోయారు. కేవలం నాలుగు పంచాయతీలు గెలిపించుకోగలిగారు మాజీ మంత్రి దేవినేని. ఈ పరిణామాలతో షాక్‌లో ఉన్న దేవినేనికి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం మరో కష్టం తెచ్చిపెట్టిందని టాక్. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ పోరు ఉంటుందనే దిశగా పార్టీలు అలర్ట్ అయ్యాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎంపీటీసీలుగా నామినేషన్ వేసిన ముగ్గురు వైసీపీలో చేరిపోయారు. అది కూడా ఉమా నివాసం ఉండే గొల్లపూడి ప్రాంతంలో వారే కావడంతో అసలు చర్చ మొదలైంది.
పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దెబ్బకొట్టగా.. ఎంపీటీసీల విషయంలో వైసీపీ నేత తలసిల రఘురాం కథ నడిపారట. ఆయన సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉంటారు. పైగా గొల్లపూడికి చెందినవారే. దేవినేని సామాజికవర్గానికి చెందిన నాయకుడే కావడంతో పని చక్కబెట్టేశారట.సాధారణ ఎన్నికల్లో దేవినేని ఉమాకు మెజారిటీ వచ్చే గొల్లపూడిలో.. నామినేషన్ వేసిన అభ్యర్థులు వెళ్లిపోవడంతో టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారట.
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ప్రత్యర్థి నేతకు పోటీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేకు మరో నేత తోడు కావడమే దేవినేనిని టెన్షన్ పెడుతుందట.ఈ సవాళ్లను ఉమా ఎలా ఎదుర్కొంటారో చూడాలి.