తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే ఇందులో చాలా వరకు కోలుకుంటుంటే.. కొంతమంది మరణిస్తున్నారు. తాజాగా.. ఈ మహమ్మరికి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాతంగి నర్సయ్య(76) బలయ్యారు. ఇటీవల కరోనా వైరస్ బారిపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కరోనాతో పాటు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు.
అతని భార్య జోజమ్మ వారం రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మాతంగి నర్సయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన నర్సయ్య.. కొంతకాలం పాటు మంత్రిగానూ సేవలు అందించారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.