వైఎస్సార్సీపీ నేతల వేధింపులు తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు డీజీపీకి లేఖ రాయడం తెలిసిందే. దళిత వర్గానికి చెందిన ఎం నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఆయన ఆ లేఖలో గుర్తుచేశారు. మంత్రి నియోజకవర్గం పుంగనూరులో క్షీణించిన శాంతి భద్రతలకు ఇదే నిదర్శనమన్నారు.
ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 91 ప్రకారం చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు కూడా చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై సాక్ష్యాధారాలు ఉంటే వారంలోగా కార్యాలయానికి హాజరై ఇవ్వాలని స్పష్టం చేశారు.