ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌ లో పోటీపడుతున్న నేతలు వీరే…!

-

పాలమూరు జిల్లా కాంగ్రేస్ నేతల దృష్టి ఇప్పుడు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పై పడింది . ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రేస్ శ్రేణులు తహతహలాడుతున్నాయి . కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ , నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పార్టికి వ్యతిరక ఫలితాలు రావడం తో , అదే ఫలితాలను పునరావృత్తం చేసి సత్తా చాటాలని హస్తం పార్టి శ్రేణులు ఉవ్వీళ్లూరుతున్నాయి . పట్టభద్రులు ఈ సారి తమవైపే ఉన్నారని భావిస్తోన్నపాలమూరు కాంగ్రేస్ పార్టిలో ఎమ్మెల్సీ టికెట్ ఆశావహుల సంఖ్య కూడా బాగానే ఉంది .

2007 లో శాసన మండలి పునరుద్దరించిన తరువాత తొలి ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీ గా గెలుపొందారు. లక్కీ డిప్ సిస్టమ్ లో రెండు సంవత్సరాల పదవి కాలం మాత్రమే దక్కడంతో ,…ఆ తరువాత తిరిగి 2009లో పోటీ చేసి మరో ఆరు సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్సి గా కొనసాగారు. ఇక 2015 లో జరిగిన మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి నుంచి రామచంద్రరావు , టిఆర్ఎస్ నుంచి ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ , కాంగ్రెస్ నుంచి రవికుమార్ గుప్తా , బరిలో నిలవగా బిజెపి అభ్యర్ది రామచంద్రరావు ను గెలిపించి మండలి కి పంపారు పట్టభద్రులు . ఈ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ ఓటమిని చవిచూశారు. 2007 లో శాసన మండలి పునరుద్దరణ తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్ పరిధిలో పట్టభద్రులు విభిన్నమైన తీర్పు ఇచ్చారనే చెప్పవచ్చు .

 

గత ఎన్నికల్లో రెండు లక్షల తొంబై వేలకు పైగా ఓటర్లు ఎన్ రోల్ చేసుకోగా యాభై శాతం మేరనే ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది . అయితే ఈ సారి ఐదున్నర లక్షల కు పైగా ఓటర్లు ఎన్ రోల్ కానున్నట్లు అంచనా . ఇదిలా ఉంటే ఈ సారి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకోని తమ సత్తా చాటాలనుకుంటున్నారు పాలమూరు హస్తం పార్టి నేతలు . బరిలో నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , ఏఐసిసి సెక్రటరీ లు, అనుబంద సంఘాల నేతలు ఉవ్వీళ్లూరుతున్నారు . కరీంనగర్ ఎమ్మెల్సి ఎన్నికల ఊపును మరో మారు పునరావృతం చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది . ప్రభుత్వం నిరుద్యోగులు , ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు తమకు లాభిస్తోందని భావిస్తున్నారు కాంగ్రేస్ శ్రేణులు. నీళ్లు , నిధులు , నియామకాల స్లోగన్ తో సాగిన తెలంగాణ ఉద్యమం … తెలంగాణ ఏర్పాటు తరువాత నియామకాల విషయంలో ప్రభుత్వ ధోరణి, …ఉద్యోగుల పిఆర్సి , డిఏ , ప్రమోషన్స్ వంటి అంశాల తో పట్టభద్రులు తమ వైపే ఉన్నారంటున్నారు కాంగ్రేస్ నేతలు .

గత ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బరిలో నిలిచేందుకు వెనుకాడిన హస్తం పార్టి నేతలు … ఈ సారి టికెట్ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఆశావహులుగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్ రెడ్డి , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ , మాజీ మంత్రి ,ఏఐసిసి సెక్రటరీ, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి , టిపిఆర్ టియూ వ్యవస్థాపక అధ్యక్షుడు , టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి , డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ , సీనియర్ న్యాయవాది ఎన్ పి వెంకటేశ్ లు ఎమ్మెల్సి టికెట్ ఆశావహులుగా ఉన్నారు . వీరితో పాటు రంగారెడ్డి ,హైదరాబాద్ జిల్లాల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది .

గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతల కంటే , ఉద్యోగ , విద్యార్ది , సంఘాలతో అనుబందం ఉన్నవారికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తే ఎన్ రోల్ మెంట్ కు తగ్గట్లు ఓట్లు పోలయ్యే అవకాశం ఉందంటున్నారు పలువురు టికెట్ అశిస్తున్నపార్టి అనుబంద సంఘాల నేతలు . మొత్తం మీద ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలను అటు అధికార పార్టి కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకోనుంది . మరో పక్క బిజెపి కూడా గట్టి పోటినే ఇవ్వనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు విపక్ష పార్టిల్లో ఏ పార్టి కి పడనుందో , మరి కాంగ్రెస్ లో ఉవ్వీళ్లూరుతున్న ఏ నేతకు ఎమ్మెల్సీ టికెట్ దక్కనుందో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news