బీజేపీ నిన్న ఒక్క రోజే భారీ షాక్ తగిలింది. కాషాయ కండువా కప్పుకున్న బీసీ నేతలు స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. త్వరలోనే మాజీ ఎంపీ జతేందర్ రెడ్డి కూడా తిరిగి టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఈ క్రమంలో పార్టీ మార్పు పుకార్లపై తాజాగా జితేందర్ రెడ్డి స్పందించారు. తాను బీజేపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తననెవరూ కొనలేరని, తన వెంట్రుకలను కూడా కొనలేరంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన తమ్ముడు బండి సంజయ్‌ను సీఎంను చేసిన తర్వాతే వేరే ఆలోచన చేస్తానని చెప్పారు. తుక్కు మనుషులే బీజేపీని వదిలి పోతున్నారని, తన లాంటి వారు పోరని జితేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ గతంలో బీజేపీలో చేరారు. ఆ ముగ్గురు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జితేందర్ రెడ్డి కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. దీంతో జితేందర్ రెడ్డి కూడా తిరిగి కారెక్కుతారనే ఊహాగానాలు వినిపించాయి. తాను తిరిగి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలపై జితేందర్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఆయనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది.