హన్మకొండ బిజెపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అగ్నిపధ్ కు వ్యతిరేకంగా బిజెపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఆ విషయం తెలిసి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో సీఐ చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో పలు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చి కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.కాగా కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.