మహమ్మారి అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా చేసింది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లకి అతుక్కుపోవడం అలవాటైపోయింది. బయటకి వెళ్తే కరోనా భయం కాబట్టి ఇంట్లోనే ఉంటూ టీవీ, కంప్యూటర్, మొబైల్ వాడకం పెరిగిపోయింది. దాంతో కళ్ళపై (Eye care) భారం ఎక్కువగా పడుతుంది. ఇలా దురద, నీళ్ళు కారడం, ఇంకా ఇతర ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఈ మహమ్మారి సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల నుండి మీ కళ్ళని ఎలా రక్షించుకోవాలో ఇక్కడ చూద్దాం.
మీరు తీసుకునే ఆహారం
పాలకూర, క్యారెట్, ఇతర ఆకుకూరలు, ఇంకా అరటి పండు, స్వీట్ పొటాటో, ద్రాక్ష, మామిడి మొదలగునవి ఆహారంగా తీసుకోవడం మంచిది. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి కళ్ళకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటుంది. ఒమెగా3 కొవ్వులు కళ్ళలో నీళ్ళూ ఉత్పత్తి చేసేందుకు సాయపడుతుంది. ఈ కారణంగా కళ్ళు ఎండిపోకుండా ఉంటాయి.
తరచుగా విరామం
ఎలక్ట్రానిక్ తెర ముందు కూర్చున్నప్పుడు 15-20నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవద్దు. ఆ తర్వాత కళ్ళని వాటి నుండి తప్పించి వేరే వైపుకు చూడాలి. ఒక 20సెకన్ల పాటు కళ్ళు మూసుకోవాలి. ప్రతీ రెండు గంటలకి ఒకసారి కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. ముఖం కడుక్కున్న బాగానే ఉంటుంది. కళ్ళని చేతులతో రుద్దకూడదు. మరీ ఎండిపోయాయని అనుకున్నప్పుడు కళ్ళని తెరుస్తూ మూస్తూ ఉండాలి.
నీలికాంతిని అడ్డుకునే కళ్ళద్దాలు తెచ్చుకోండి
మార్కెట్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్ పరికరాల తెర మీద నుండి వచ్చే నీలికాంతిని అడ్డుకుంటాయి. దాంతో కళ్ళమీద ఎక్కువ భారం పడకుండా ఉంటుంది.