8న తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే!

హైదరాబాద్: జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్., రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాలపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం, రైతుబంధు, కల్తీ విత్తనాలపై తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపైనా కేబినెట్ చర్చించే అవకాశాలున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా కరోనా రెండో వేవ్, కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించనున్నారు . థర్డ్ వేవ్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత, తగు ఏర్పాట్లపైనా కేబినెట్ మంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైందనే అంశాల‌పై కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.

జూన్ 7 నుంచి ప్రారంభించనున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులందరూ ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎవరెక్కడెక్కడ పాల్గొనే అంశపైనా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.