ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ మరో ఏడాది పాటు తన ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ఉద్యోగులు జూలై 2021 వరకు ఇంటి నుంచే పనిచేయవచ్చు. ఇక ఇంట్లో ఆఫీసు పనులకు సంబంధించిన ఖర్చులకు గాను ఫేస్‌బుక్ ఒక్కో ఉద్యోగికి 1000 డాలర్లను అందివ్వనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌కు చెందిన ఓ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.
కాగా ఇప్పటికే గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ జూన్ 2021 వరకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే ట్విట్టర్ కూడా తమ ఉద్యోగులకు నిరవధికంగా అందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ కూడా అదే జాబితాలో చేరింది. ఉద్యోగులు అవసరం అనుకుంటే కార్యాలయాలకు రావచ్చు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను ఆయా దేశాల్లోని నిబంధనల ప్రకారం కార్యాలయాలకు అనుమతిస్తారు. ఇక మన దేశంలోనూ అనేక ఐటీ కంపెనీలు 90 శాతం వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని అందిస్తున్నాయి. కేవలం అత్యవసరం అనుకున్న ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు రావాలని చెబుతున్నాయి.
వచ్చే ఏడాది వరకు కరోనా తగ్గే సూచనలు కనిపిస్తుండడంతో అప్పటి వరకు ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయనున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను కీలక దశల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ నుంచి అనేక వ్యాక్సిన్లు ప్రజా పంపిణీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.