ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో నకిలీ వార్తలు, ఫొటోలు కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్న విషయం విదితమే. వాటిని చాలా మంది నిజమని నమ్మి మోసపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్నట్లుగా ఉంది. అయితే తాజాగా యూపీ సీఎం యోగిని కలిసిన అంబానీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం రూ.500 కోట్లను సీఎం యోగికి ఇచ్చారని, అందుకనే ఆయన్ను కలిశారని చెబుతూ ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. కానీ ఈ ఫొటో నిజమే కానీ.. ఆ వార్త నిజం కాదని తేలింది.
#BharatSamachar #Delhi :- राम मंदिर निर्माण के लिए तिरूपति बालाजी मंदिर देगा एक अरब रुपए. pic.twitter.com/hAbtMOLvkN
— भारत समाचार (@bstvlive) November 11, 2019
అసలు ఆ ఫొటోకు సంబంధించిన వార్త వేరే. అది 2017లో జరిగింది. యూపీలో రైతులకు డిజిటల్ శిక్షణ తరగతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహకారం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. అందుకనే అప్పట్లో ముకేష్ అంబానీ యూపీ సీఎం యోగిని కలిశారు. అయితే ఆ ఫొటోను పట్టుకుని ముకేష్ అంబానీ అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం రూ.500 కోట్లు సీఎం యోగికి ఇచ్చారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇక టీటీడీ కూడా రామ మందిరం నిర్మాణం కోసం రూ.100 కోట్లు ఇచ్చిందని మరొక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పరిశీలిస్తే ఇది కూడా నకిలీ వార్తేనని తేలింది. టీటీడీ అధికారులను ఈ విషయంపై మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. వారు ఆ వార్త వట్టిదే అని తేల్చేశారు. దీంతో ఈ రెండు వార్తలూ నకిలీవేనని వెల్లడైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయో ఈ రెండు వార్తలను చూస్తే మనకు అర్థమవుతుంది.